-
తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన జగన్
-
జగన్ అవినీతి సొమ్మును కక్కిస్తా
-
టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం
అమరావతి,సెప్టెంబర్ 21 (ఆంధ్రపత్రిక): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో జగన్ తీరును టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. హెల్త్ వర్సిటీ పేరు మార్చి ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పేరు మార్చి జగన్రెడ్డి తన నీచ బుద్ధిని బయటపెట్టుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అవినీతి సొమ్మును కక్కించే రోజు తొందర్లోనే వస్తుందని హెచ్చరించారు. జగన్రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని, పోలవరం, అమరావతి, నాడు`నేడు అన్నీ అబద్దాలేనని దుయ్యబట్టారు. బీసీలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి.. శక్తి మాజీ సీఎం ఎన్టీఆరేనని టీడీపీ నేత చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ బీసీ సాధికార ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు టీడీపీని వెన్నంటి ఉన్నారని, వారికి టీడీపీ రుణపడి ఉందన్నారు. టెక్నాలజీ పెరగడంతో.. చేతివృత్తులు మూలనపడ్డాయని, కులవృత్తి పోతే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని ఆలోచించామని తెలిపారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీల నాయకత్వం పెంచామని, సీఎం జగన్ వచ్చాక బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని తప్పుబట్టారు. ఈ రోజు తెలుగుజాతికి దుర్దినమని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చడానికి ఎలా మనసు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకునేవరకూ పోరాడతామన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గ్దదె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ నేతలే ఎన్టీఆర్ పేరు మార్పును ఒప్పుకోరని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆరోగ్య వర్సిటీని ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు.పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్ పేరును మార్చడం సరికాదని సూచించారు. ఏపీని ఐదుగురు రెడ్లకు జగన్రెడ్డి కట్టబెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీలపై పెత్తనం చేయాలని రెడ్లకు జగన్ అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. జగన్రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు.