- మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు నిలిపివేత
- 4వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం
హైదరాబాద్,అక్టోబర్29(ఆంధ్రపత్రిక): ఫాం హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయవద్దని ఆదేశించింది. ఫాం హౌస్ కేసులో ప్రతివాదులుగా ఉన్న 8 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసులు 4వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్లో చెప్పింది. ఫాంహౌజ్ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్రంగా విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై శనివారం విచారణ జరిపిన న్యాయ స్థానం బీజేపీ తరఫు న్యాయవాది వాదన లతో ఏకీభవించిన న్యాయమూర్తి మునుగోడు ఎన్నిక ముగిసే వరకు పోలీసు దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు