తెలంగాణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఓటమి పాలవ్వడం ఒక ఎత్తయితే.. ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాను పోటీ చేసిన కామారెడ్డిలో ఓడిపోవడం మరో ఎత్తు.
కేసీఆర్‌పై 6,741 ఓట్ల మెజార్టీతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి(కేవీఆర్) విజయం సాధించారు.
40 ఏళ్లుగా ఓటమి ఎరుగని కేసీఆర్‌ను ఓడించిన రెండో వ్యక్తి కేవీఆరే. అంతకుముందు 1983 సంవత్సరంలో అనంతుల మదన్ మోహన్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గంలో కేసీఆర్‌ను ఓడించారు. ఇప్పటివరకు కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు ఆయనే. అప్పట్లో కేసీఆర్‌పై మదన్ మోహన్ 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేసీఆర్‌కు అవే తొలి ఎన్నికలు.
తొలి ఎన్నికలలో కేసీఆర్‌కు పరాజయం ఎదురైంది. కానీ, ఆ తరువాత కేసీఆర్ మళ్లీ ఓడిపోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు వరుసగా ఆయన చట్టసభలకు ఎన్నికవుతూనే ఉన్నారు.
కానీ, 40 ఏళ్ల తర్వాత ప్రస్తుతం కామారెడ్డిలో వెంకటరమణా రెడ్డి చేతిలో 6741 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓటమి పాలయ్యారు.
కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో ఓడిపోయారు. ఈ ఇద్దర్ని కాదని కామారెడ్డి ప్రజలు బీజేపీ అభ్యర్థికే పట్టం కట్టారు.
ఎవరీ వెంకటరమణా రెడ్డి?
వెంకటరమణా రెడ్డి కామారెడ్డి లోకల్ క్యాండిడేట్. ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని తొలుత కాంగ్రెస్‌లో ప్రారంభించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(వైఎస్సార్) ప్రభుత్వంలో పూర్వపు నిజామాబాద్ జిల్లాలో ఎంపీటీసీ సభ్యునిగా వెంకటరమణా రెడ్డి పనిచేశారు.
ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై, జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆయన తండ్రి పెద్ద రాజా రెడ్డి కూడా 25 ఏళ్లు కామారెడ్డి సమితి ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు.
తన తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు వెంకటరమణా రెడ్డి.
వైఎస్సార్ మరణం తర్వాత, రమణా రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలు వచ్చాయి.
సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, వెంకటరమణా రెడ్డి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్థన్, కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ షబ్బీర్ అలీ తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
2018 ఎన్నికల తర్వాత వెంకటరమణా రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల మన్ననలను పొందారు.
కామారెడ్డి పట్టణ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ఉద్యమంలో వెంకటరమణా రెడ్డి ముందున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇండస్ట్రియల్ జోన్ వంటి అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఎనిమిది గ్రామాల్లో 2 వేల ఎకరాలను కొనుగోలు చేయాలని ఈ ప్లాన్ కింద ప్రతిపాదించారు. ఎన్నికల ముందు రైతుల నుంచి ఈ వ్యతిరేకత రావడంతో ప్రతిపాదిత ప్లాన్‌ను వెనక్కి తీసుకున్నారు.
బీజేపీలో చేరిన తర్వాత 2018లో డ్వాక్రా మహిళలకు రావాల్సిన పావల వడ్డీ రుణాల విడుదల కోసం ఆయన పోరాడారు.
కామారెడ్డిలో నవయువ భేరి కార్యక్రమాన్ని నిర్వహించి యువకులకు రాజకీయాలపై అవగాహన కల్పించారు. అప్పటి నుంచి ప్రజల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
కరోనా సమయంలో కూడా వలస కూలీలకు భోజనం, హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్ కిట్స్ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఉద్యమం కూడా చేపట్టారు.
అక్టోబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం కింద నియోజకవర్గంలోని వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా పౌష్టికాహార కిట్స్‌ని ఆరు నెలల పాటు అందించారు. ఇలా ఆయన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
స్థానికత అంశం కలిసి వచ్చిందా?
పార్టీ మేనిఫెస్టో కాకుండా సొంతంగా మేనిఫెస్టో విడుదల చేయడంతో పాటు స్థానికత అంశం కూడా వెంకటరమణా రెడ్డికి కలిసి వచ్చింది.
ఎందుకంటే, కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరికీ ఇది రెండో నియోజకవర్గమే.
ప్రధానంగా కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి, రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేశారు. రెండో స్థానంగా కామారెడ్డి నుంచి వీరు బరిలోకి దిగారు.
దీంతో స్థానికత అంశం కూడా వెంకటరమణా రెడ్డికి బాగా కలసివచ్చిందని వినిపిస్తోంది.
కానీ, తానెప్పుడూ లోకల్, నాన్ లోకల్ అన్న విషయాన్ని ప్రస్తావించలేదని వెంకటరమణా రెడ్డి అన్నారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని చెప్పారు.
వృత్తిపరంగా తాను వ్యాపారం చేస్తున్నట్లు వెంకటరమణా రెడ్డి అఫిడవిట్లో తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన జనరల్ కేటగిరీ నుంచి పోటీ చేశారు.
కామారెడ్డిలో ఆయనకు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది.
‘జీవితాంతం రుణపడి ఉంటా, కామారెడ్డి ప్రజలకు ఈ గెలుపు అంకితం’
ప్రస్తుతం వెంకటరమణా రెడ్డి పేరు తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.
ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్‌పై, ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి పదవి చేపడతానని భావిస్తోన్న రేవంత్ రెడ్డిపై ఈయన గెలిచారు.
ఈ గెలుపు కామారెడ్డి ప్రజలకు అంకితమిచ్చారు వెంకటరమణా రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరికీ, ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం కామారెడ్డి ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.
డబ్బు, మద్యం అనే ప్రస్తావన లేకుండా తనకు ఓట్లు పడ్డాయని, ప్రతి దగ్గర ఇలాంటి పరిస్థితులు రావాలన్నారు.
కేసీఆర్‌ను, రేవంత్ రెడ్డిని మామూలు అభ్యర్థిగానే చూశానని, వారు కూడా సాధారణ వ్యక్తులేనని బీబీసీతో అన్నారు.
రాజకీయాల్లో ఎంతోమంది మహానుభావులు వచ్చి కనుమరుగయ్యారని, వాళ్లు కూడా అంతే, ఆ తర్వాత తాను కూడా అంతేనని అన్నారు.
తాను మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించి పెడతానని వాగ్దానం చేశారు.
ఇప్పటి వరకైతే కామారెడ్డి ప్రజల కోసమే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏది ఉన్నా, ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రత్యేకంగా నిధులు వస్తూనే ఉంటాయన్నారు. ఆ నిధులని కామారెడ్డి అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.
వెంకటరమణా రెడ్డిని శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ ఐటీ విభాగపు అధినేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ” కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి పెద్ద తలలను ఓడించిన వ్యక్తిని కలుసుకోండి. లోక్‌సభలో పెద్ద ఎత్తున బీజేపీ గెలవడమే కాకుండా.. వచ్చే సారి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తుంది” అని అమిత్ మాల్వియా ట్వీట్‌లొ రాశారు.