స్పష్టం చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్టణం,నవంబర్1(ఆంధ్రపత్రిక):పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారని, అన్ని వర్గాలతో తాము తరచు సమావేశాలు నిర్వహించుకుంటున్నామని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ జనసేన పొలిటికల్ పార్టీ కాదని… సినిమా పార్టీ అని విమర్శించారు. ఒక విధానం సిద్దాంతం లేని పార్టీ అని, దాని గురించి తాము మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుందని, ప్రజాస్వామ్యంలో పనికిరాదని అన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే.. పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. పవన్ కంటే కేఏ పాల్ నయమని, 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు. అలాగే పవన్ కూడా 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక ఊహించినదేనని, వారు కలవడం, విడిపోవడం సహజమేనన్నారు. కాపుల కోసం ముద్రగడ పోరాటం చేసినప్పుడు, పవన్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర చేస్తున్నది రైతులు కాదని, డబ్బుల కోసం వచ్చిన వాళ్ళేనని.. అందుకే వెనక్కి వెళ్ళిపోయారని విమర్శించారు. కోర్టు ఆదేశాలు తమకు అభ్యంతరం లేదని, అమరావతి రైతులు పాదయాత్ర పూర్తిగా మానుకోవాలని తాము కోరుతున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఇదిలావుంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలోని స్థానిక 82 వ వార్డులోని 14వ సచివాలయం నర్సింగరావు పేట పాత బర్మా కాలనీలో మంగళవారం పర్యటించారు.. మంత్రి అమర్నాథ్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది..ఇంటింటికీ వెళ్లి వారికి మంజూరైన ప్రభుత్వ పథకాలను అందచేశారు..పథకాలు అందని ఒకరిద్దరు మంత్రి అమర్నాథ్ వచ్చి చెప్పగా వాలంటిర్లను పిలిచి వారికి పథకాలు అందేనీదుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలుచోట్ల మహిళలు అమర్నాథ్ పై పూల వర్షం కురిపించారు. వందలాది మంది కార్యకర్తలు, నాయకులు అమర్నాథ్ వెంట నడిచారు…ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను అమర్నాథ్ లబ్దిదారులకు అందజేశారు..ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందజేస్తామని హావిూ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని ఆయన చెప్పారు..అనకాపల్లి 82 వ వార్డు పరిధిలో తహసిల్దార్ వెనుక ఉన్న శారద కాలనీలో సుమారు 35.70 లక్షల రూపాయల తో రోడ్డు, కాలువలు విస్తరణ పనులకు మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనకాపల్లి 82 వ వార్డు పరిధిలో నర్సింగరావుపేట పాత కరెంట్ ఆఫీస్ వీధిలో సుమారు 27 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు, కాలువలు విస్తరణ పనులకు మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.. రోడ్లు, కాలువలు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వీలైనంత త్వరగా ఈ రోడ్డు, కాలువల విస్తరణ పనులు పూర్తిచేసి, రోడ్లు, కాలువలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే! పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజ లతో మమేకం అయి ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అడుగడుగునా విశేష స్పందన లభించింది.