ప్రధాని మోదీ పూజలు చేసిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం.
ANDHRAPATRIKA : – – దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఘనంగా దుర్గాపూజ పండుగను జరుపుకుంటున్నారు. దుర్గాపూజ సందర్భంగా, అటు బంగ్లాదేశ్‌లో 4 రోజులపాటు సెలవు ప్రకటించింది సర్కార్.
దేశం మొత్తం పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లోని సత్ఖిరా నగరంలోని శ్యామ్నగర్లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం చోరీకి గురైంది. ఈ చోరీ ఘటన ఆలయంలోని సీసీటీవీలో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి.
బంగ్లాదేశ్‌లోని ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు ఆ దేశానికి బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఈ కిరీటం దుర్గాపూజ ప్రత్యేక సందర్భంలో చోరీకి గురైంది.
ఈ ఆలయంలో దొంగతనం జరిగిన సంఘటన గురువారం (అక్టోబర్ 10) మధ్యాహ్నం 2:47 నుండి 2:50 గంటల మధ్య జరిగింది. ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ రోజువారీ పూజను పూర్తి చేసిన తర్వాత, ఆలయ తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు. అయితే ఇతర పనుల్లో నిమగ్నమైన రేఖ సర్కార్, తిరిగి వచ్చి చూసే సరికి కాళి మాత బంగారు కిరీటం కనిపించకుండాపోయింది. దీంతో ఈ విషయాన్ని అందరికీ తెలియజేసినట్లు రేఖ సర్కార్ వెల్లడించారు.
ఈ చోరీ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఫకర్ తైజుర్ రెహ్మాన్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఇచ్చిన బహుమతి దొంగిలించారన్నారు. దానిని కనుగొనడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. విచారణ కొనసాగుతోంది. నిందితుడిని గుర్తించడానికి సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
51 శక్తి పీఠాలలో జేశోరేశ్వరి ఆలయం ఒకటి
కిరీటం వెండితో తయారు చేసి, బంగారంతో కప్పబడి ఉంది. ఈ కిరీటం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశంలో దుర్గాపూజ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్న తరుణంలో, ఈ కిరీటం చోరీకి గురికావడం సాధారణ విషయం కాదు. 51 శక్తి పీఠాలలో జెశోరేశ్వరి ఆలయం ఒకటి. “జేషోరేశ్వరి” అనే పేరుకు “జెషోర్ దేవత” అని అర్ధం. ప్రధాని మోదీ మార్చి 27, 2021న బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా జెషోశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. అదే రోజు, కాళీ ఆలయంలో ప్రధానమంత్రి దేవతకు బంగారు కిరీటంతో పూలమాల వేశారు.