మొవ్వ (కాజ): నవంబర్ 25, ఆంధ్రపత్రిక.:
భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని, దేశంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక పథకాలు ప్రవేశపెట్టారని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. గ్రామస్థాయిలో అర్హులందరికీ ఈ పథకాలు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం కింద శనివారం మొవ్వ మండలం కాజ గ్రామంలో పిఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు నేరుగా, మరికొన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 17 పథకాలు, పట్టణ ప్రాంతాల్లో 17 పథకాలు కేంద్రం అమలు చేస్తున్నదని అన్నారు. ఈ పథకాల క్రింద ఎంతమంది లబ్ధి పొందారో పరిశీలించి, ఇంకా లబ్ధి పొందని వారికి అందించాలని, కేంద్ర పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నుండి జనవరి 26 వరకు నిర్వహిస్తున్నదని అన్నారు. రైతు భరోసా పథకం కింద 6 వేల రూపాయలు కేంద్రం లబ్ధిదారులకు అందిస్తున్నదని అన్నారు. ఈ పథకాలు అందని వారికి అందజేయడం, అభివృద్ధిలో భాగస్వాములు చేయడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పథకాలు పొందని వారు వారి పేర్లు నమోదు చేసుకుని ప్రయోజనం పొందాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రామసభల ద్వారా పథకాలు వాటి ప్రయోజనాలు ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యానికి సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే జిల్లాలో నిర్వహించుకున్నామని అన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర శిబిరాలలో కూడా ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుందని, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే కేంద్ర పథకాల లబ్ధి పొందినవారు వారి అనుభవాలు ఇతరులతో పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఎక్కువగా భాగస్వామ్యం కావాలన్నారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు:
పీఎం కిసాన్- రైతు భరోసా పథకం కింద లబ్దిపొందిన మంద రవి రెడ్డి, ఈశ్వరరెడ్డి లు తమ అనుభవాలు వివరిస్తూ పీఎం కిసాన్ క్రింద ఏడాదికి 6 వేల రూపాయలు మూడు విడతల్లో లబ్ది పొందామని, వ్యవసాయ సాగు ఖర్చులకు ఈ మొత్తం వినియోగించుకున్నట్లు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు.
సాయిల్ హెల్త్ కార్డు ద్వారా లబ్ధి పొందిన పేకేటి సీతారామరెడ్డి మాట్లాడుతూ మా పొలం మట్టి నమూనా పరీక్షలు చేసి ఏఏ ఎరువులు వాడాలి సూచనలు చేశారని ఆ విధంగా మేము మంచి దిగుబడులు సాధిస్తున్నామని తెలిపారు.
కాజ గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని, రసాయన ఎరువులు వాడకుండా, జీవన సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నామని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం కలెక్టర్ వివిధ స్టాల్స్ సందర్శించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బిపి, షుగర్, హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విభాగం జీవన ఎరువులు (బయో కల్చర్) ప్రదర్శన తో పాటు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం, జీవన ఎరువుల వాడకం, వాటి తయారీకి కావలసిన పదార్థాలు గురించి రైతులకు అవగాహన కల్పించారు.
కేంద్ర ప్రభుత్వ పథకం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు.తొలుత వికసిక్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా సభికులచే కలెక్టర్ సంకల్పం (ప్రతిజ్ఞ) చేయించారు.
వివిధ శాఖల జిల్లా అధికారులు వారి వారి శాఖల ద్వారా అమలవుతున్న కేంద్ర పథకాల గురించి వివరించారు.జడ్పీ సీఈవో జ్యోతి బసు, డిపిఓ నాగేశ్వర నాయక్, డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఉద్దేశం వివరించారు.
డి.ఎస్.ఓ పార్వతి మాట్లాడుతూ పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద జిల్లాలో కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున 2020 నుండి ఉచితంగా అందజేస్తున్నట్లు, జిల్లాలో 1,50,000 మంది లబ్ధి పొందుతున్నారని, పీఎం ఉజ్వల యోజన పథకం కింద జిల్లాలో 3,350 మందికి గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు.
డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జే. గీతా బాయి మాట్లాడుతూ జిల్లాలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద 9 లక్షల పైగా ఆరోగ్య కార్డులు అందించినట్లు తెలిపారు.ఉయ్యూరు ఆర్డీవో రాజు, తాసిల్దారు ఆంజనేయ ప్రసాద్, ఎంపీడీవో జి సుధా ప్రవీణ్ కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
రాణి రుద్రమదేవి, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం ప్రదర్శించిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ అభినందించారు.గ్రామ సర్పంచ్ కొడాలి భవాని, ఉపసర్పంచ్ మంద శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు వెంకటలక్ష్మి, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.