మచిలీపట్నం సెప్టెంబర్ 23 ఆంధ్ర పత్రిక.
మచిలీపట్నం వైభవం, చారిత్రాత్మక నేపథ్యం ఎంతో అపురూపమని అటువంటి వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం సంరక్షించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ప్రకటించారు.
శనివారం ఉదయం పట్టణ పరిధిలో చారిత్రాత్మక నేపథ్యం ఉండి వారసత్వ సంపదగా గుర్తించదగ్గ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పర్యాటక అభివృద్ధికి దోహదపడగల ప్రదేశాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, పర్యాటక శాఖ, రెవెన్యూ, మునిసిపల్ తదితర అధికారులతో కలిసి మచిలీపట్నంలోని ఇరవై కు పైగా చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాలను సందర్శించారు.
తొలుత ఆయన బందరు కోటలో శిధిలమైన నిజాం ఆసుపత్రి, నాటి జిల్లా జైలు.. ఆ సమీపంలోనే ఉన్న డచ్ ఫోర్ట్, ఆయుధగారము, బెల్ టవర్, నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కోసం నిర్మించబడి ఉప్పెనలు కూలిపోయిన సెయింట్ జాన్ చర్చి, ఇనుప గ్రిల్ రక్షణగా నిర్మించబడిన ప్రహరీ లోపల ఖాళీ స్థలం, నాటి మొగల్ చక్రవర్తి షాజహాన్, యువరాజు నూర్ జహోమ్ 16వ శతాబ్దంలో విడిది చేసిన ప్రాంతం, ఈ సమీపంలోనే 250 సంవత్సరాల క్రితం నాటి యూరోపియన్స్ ద్వారా నిర్వహించబడే గన్‌పౌడర్ నిల్వ చేసేందుకు పిరమిడ్ మాదిరిగా ఉన్న పెద్ద పురాతన ఆయుధగారం, అదేవిధంగా భారీ చేప కన్ను, దాని శరీర ఎముకలతో నిర్మించబడిన శిధిలమైన కోట ప్రాంతం, రోమన్ క్యాథలిక్ మిషన్ పురాతన ఖనన భూమి, అదే ప్రాంగణంలో 1864 నవంబర్ ఒకటవ తేదీన సంభవించిన భారీ ఉప్పెనలో నాటి మచిలీపట్నం జనాభా 62,000 కాగా 30 వేల మంది ప్రజలు తమకేమీ జరుగుతుందో తెలియని స్థితిలో చనిపోయారు వారి జ్ఞాపకార్థం వారి ఆత్మ శాంతి కోసం నాడు ఉపద్రవంలో తమ కుటుంబాన్ని కోల్పోయిన ఒక ఆంగ్లేయ అధికారి నిర్మించిన స్మారక చిహ్నం, ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన రైల్వే ట్రాక్ శిథిలాలు, బ్రిటిష్ పాలనలో నీటిపారుదల ఉద్యోగుల క్వార్టర్స్, పోర్ట్ వర్క్‌షాప్‌లు, ఓడల ద్వారా సరుకు రవాణా చేసినందుకు నిల్వచేసే గోడౌన్లు, నాటి బందరు కాలువ ఫెర్రీ నుంచి పడవలు తిరిగిన ప్రాంతం, 1843లో రాబర్ట్ టర్లింగ్ టన్ నోబుల్ చేత స్థాపించబడిన నోబుల్ హైస్కూల్, మాచవరం లోని డచ్ దేశస్థుల బరియల్ గ్రౌండ్ (డచ్ సెమీట్రీ ) అలాగే, 220 సంవత్సరాల క్రితం నాటి మచిలీపట్నం తాజ్ మహల్ గా పిలవబడే సెయింట్ మేరీస్ చర్చ్ ఇక్కడే మేరీ అరబెల్ల మృత శరీరాన్ని లేపనాలను పూసి గాజు పెట్టిలో భద్రపరిచి భూగృహంలో ఆమె ప్రేమికుడు, నాటి ఆంగ్లేయ సైనిక అధికారి మేజర్ జనరల్ జాన్ పీటర్ చేత దాచబడిన మమ్మీ ఈ చర్చి లోపల నేటికీ భద్రంగా ఉంది. ఈ ప్రాంతాలను స్వయంగా సందర్శించిన కలెక్టర్ ఈ సందర్భంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ,ఏ రోజైతే చారిత్రాత్మక సంపదను సంరక్షించుకుంటామో, ఆ పునాదులపైనే మన గౌరవం ఆధారపడి ఉంటుందని భవిష్యత్ తరాలకు తమ జన్మభూమి నేపథ్యం తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
బందరులో ఇప్పటికే పురాతన పేర్లు చరిత్రను గుర్తుచేస్తున్నాయిన్నారుమచిలీపట్నంలోని అనేక ప్రాంతాలు డచ్, ఫ్రెంచ్,ఇంగ్లీష్, నిజాం నవాబుల పేర్లు ఉండడం గమనార్హం అన్నారు అలాగే పట్టణంలో అనేక స్మారక చిహ్నాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కలెక్టరేట్, కలెక్టర్ బంగ్లా వంటి కొన్ని ప్రదేశాలను మాత్రమే హెరిటేజ్ స్టేటస్ ఇస్తూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేసిందని అయితే ఎంతో అమూల్యమైన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పలు ప్రాంతాలకు వారసత్వ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తాను సూచించినట్లు, అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలకు సంబంధిత అధికారులను వెంటపెట్టుకొని చూపించినట్లు, త్వరలోనే పురాతత్వ శాఖ గుర్తింపు లభించనున్నట్లు కలెక్టర్ పి రాజబాబు తెలిపారు.
ఎప్పుడైతే ప్రాముఖ్యత గల ప్రదేశాలను వారసత్వ సంపదగా ప్రకటించిన తర్వాత వాటినన్నిటిని సంరక్షించడం జరుగుతుందన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ముడిపడి ఉన్న మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టూరిస్టులు మచిలీపట్నం వచ్చి ఈ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు తగిన ఏర్పాట్లు రూపొందించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒకటి రెండు రోజులు ఈ ప్రాంతాల్లో బస చేసేందుకు అనువుగా, ఒకరోజులో ఎన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించవచ్చు రెండు రోజుల వ్యవధిలో ఇంకెన్ని ప్రాంతాలను చూడవచ్చు అనేది ప్లాన్ చేస్తూ ఒక సర్క్యూట్ డిజైన్ చేయాలని పర్యాటక శాఖకు తాను తెలియజేసినట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.
ఈ సందర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ప్రముఖ చరిత్రకారులు మహమ్మద్ సిలార్, ఆర్కియాలజీ కన్జర్వేషన్ అసిస్టెంట్ నాగేంద్ర కుమార్, జిల్లా పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ రామ్ లక్ష్మణ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, తహసిల్దార్ శ్రీవిద్య, ఆర్ ఐ యాకూబ్, బందరు కోట కార్పొరేటర్ తిరుమలశెట్టి ప్రసాద్, 12 వ వార్డు ఇంచార్జ్ బందెల థామస్ నోబుల్ , నోబుల్ కళాశాల ప్రిన్సిపల్ జాన్ ఎర్నెస్ట్ తదితరులు పాల్గొన్నారు.