PM Modi: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జార్ఖండ్. మహారాష్ట్రతో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉంది ఇక్కడ. ప్రస్తుతం హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది.
ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.
మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 41. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు, ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.. రాంచీలో పర్యటిస్తోన్నారు. ఆయనతో వెంట ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ ఉన్నారు. తమ పర్యటనలో భాగంగా వాళ్లు.. రాజధాని రాంచీలో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జార్ఖండ్ పోలీస్ డైరెక్టర్ జనరల్, అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ పోలీస్ డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు ఇందులో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు.
రాష్ట్రంలో గల సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు.. సీఈసీకి అందజేశారు. దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2019 నాటి ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయనే వివరాలను వెల్లడించారు.