రాజేంద్రనగర్, గుండెపోటు వస్తుందని గ్రహించిన డ్రైవర్.. తాను నడుపుతున్న కళాశాల బస్సులో విద్యార్థులు ఉన్నారని, వారిని కాపాడాలని తలంచి వాహనాన్ని పక్కకు నిలిపి ప్రాణాలు వదిలిన ఘటన ఇది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన మైలారం రాజు(30) వర్థమాన్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం విద్యార్థులను తన బస్సులో ఎక్కించకుని కళాశాలకు వస్తుంటాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులను బస్సులో ఎక్కించుకున్నాడు.
ఆరాంఘర్ నుంచి మెహిదీపట్నం వైపు ప్రయాణిస్తుండగా శివరాంపల్లి సమీపంలో డ్రైవర్ రాజుకు గుండెలో నొప్పి వచ్చినట్టయింది. తన బాధను విద్యార్థులకు తెలియజేస్తూనే బస్సును పక్కకు నిలిపి స్టీరింగ్‌పైనే పడిపోయాడు. వెంటనే విద్యార్థులు ఆయన్ను దగ్గరలో ఉన్న ఓ వ్రైవేట్ ఆసుపత్రికి ఎత్తుకొని పరుగెత్తారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.