ఇటీవల చైనాకు సంబంధించిన గూఢచర్య బెలూన్ (స్పై బెలూన్)ను అట్లాంటిస్ మహాసముద్ర ప్రాంతంలో కూల్చి వేసిన అమెరికాలో వరుసగా మూడు ‘గుర్తు తెలియని ఎగిరే వస్తువు(అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్, యూయఫ్ఓ)’లను కూడా కూల్చివేయడం ఓ కలకలమైన వార్తగా గుర్తిస్తున్నారు. 28 జనవరి 2023న అమెరికా గగనతలంలో కనిపించిన చైనా గూఢచర్య బెలూన్ను 04 ఫిబ్రవరిన యూయస్ కూల్చివేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభం ఏర్పడినట్లు పెంటగన్ అధికారులు భావిస్తున్నారు. మూడు బస్సుల సైజ్‌లో ఉన్న చైనా బెలూన్ యూయస్ గగనతలంపై 65,000 అడుగుల ఎత్తున ఎగరడం గమనించిన అమెరికా వెంటనే తీవ్ర స్వరంతో స్పందించి కూల్చివేయడం చూసాం. చైనా బెలూన్ను కూల్చివేసిన తరువాత యూస్, కెనడాలు అతి అప్రమత్తం కావడం, గగనసీమ గస్తీ వ్యవస్థలను పెంచడం జరుగుతున్నది. యూయస్ మిలటరీ అంచనాల ప్రకారం అమెరికా రక్షణ వ్యవస్థల నిఘా సమాచార సేకరణ నిమిత్తం చైనా బెలూన్ను వాడడం జరిగినట్లు భావిస్తున్నారు.
యూయఫ్ఓల కూల్చివేత కలకలం:
అలస్కా ప్రాంత సముద్రంలో ఒక కారు సైజ్‌లో ఉన్న ఒక గుర్తు తెలియని “ఎగిరే వస్తువు(యూయఫ్ఓ)”ను యూయస్ ఫైటర్ జెట్ 10 ఫిబ్రవరిన కూల్చి వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 11న సిలిండర్ ఆకారంలో ఉన్న మరో యూయఫ్ఓను అలస్కా సరిహద్దులోని యుకోన్ ప్రాంతంలో అమెరికన్ యఫ్-22 ఫైటర్ కూల్చివేసినట్లు కెనడా అధికారులు తెలుపడం కొంత ఆందోళన కలిగించే వార్తగా గుర్తించారు. ఈ యూయఫ్ఓ లక్ష్యం ఏమిటో పూర్తిగా తెలియనప్పటికీ గగనసీమ నియమాలను ఉల్లంఘించడం తీవ్ర పరిణామంగా కెనడా అధికారులు గుర్తిస్తున్నారు. 12 ఫిబ్రవరిన 20,000 అడుగుల ఎత్తున మోంటానా, మిచిగాన్ ప్రాంతాల్లో కనిపించిన అష్టభుజ ఆకారం కలిగిన యూయఫ్ఓను వరుసగా మూడవసారి కూల్చి వేసినట్లు ప్రకటించారు.
గ్రహాంతరవాసుల పనేనా..!
కొద్ది రోజుల వ్యవధిలోనే మూడు యూయఫ్ఓలను కూల్చివేసిన అమెరికా అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యూయఫ్ఓలు గ్రహాంతరవాసుల పని కావచ్చని కూడా ఆలోచిస్తున్నారు. ఎలాంటి మానవ ఉనికి కనిపించని ఈ యూయఫ్ఓలు ఎలాంటి సమాచారాన్ని లేదా సిగ్నల్స్‌ను పంపకపోయినప్పటికీ ఇవి దేశ రక్షణ వ్యవస్థలకు, పౌర విమాన రద్దీకి తీవ్ర ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల్లో మూడు రహస్య మానవరహిత యూయఫ్ఓలు గగనతలంలో విహరిస్తున్నల గుర్తుతెలియని వస్తువులను లేదా ఏలియన్స్‌ను గుర్తించడం దేశ భద్రతకు, పౌర విమాన రక్షణకు ప్రమాదకరంగా మారినట్లు అందరు అంగీకరిస్తున్నారు.
అమెరికా ఎదుర్కొంటున్న ఈ ప్రమాదకర అనుభవంతో ప్రపంచ దేశాల రక్షణ వ్యవస్థలు తమ తమ గగనసీమ గస్తీలను పెంచడం, ఈ యూయఫ్ఓల లక్ష్యం, మూలాలను తెలుసుకునే పరిశోధనలకు పదును పెట్టడం సముచితంగా ఉన్నది. ప్రపంచవ్యాప్త దేశాల రక్షణ వ్యవస్థలు అమెరికా వ్యవస్థల స్థాయిలో ఉండకపోవచ్చని, యూయఫ్ఓలు గగనతలంలో తిరిగినా గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నీ దేశాలకు లేకపోవచ్చని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలను తెలుసుకోవడానికి చైనా సంధించిన గూఢచర్య బెలూన్ ఘటన ముక్తకంఠంతో ఖండించవలసిందే. ఇలాంటి అంతర్జాతీయ గగనసీమ నియమాలకు విరుద్దంగా జరిపే గూఢచర్య ఘటనలు రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరంగా మారక ముందే తగు చర్యలు తీసుకోవాలని పౌర సమాజం కోరుకుంటున్నది.