కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీస్ వినూత్నంగా ఉన్నప్పుడే కస్టమర్లను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు వివిధ బ్రాండ్లకు స్పెషల్ టీమ్స్ పని చేస్తాయి.
తాజాగా ఓ ఆటోమొబైల్ కంపెనీ ఇదే ఫార్ములాతో వెరైటీగా తమ కొత్త కారు బ్రాండింగ్ ప్రారంభించింది. కారును బంగీజంప్ చేయించి అటెన్షన్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది.
సాధారణంగా అడ్వెంచర్స్ పట్ల ఆసక్తి ఉన్నవారు బంగీజంప్ చేస్తుంటారు. ఇది రిస్క్ ఉండే అడ్వెంచర్ స్పోర్ట్. ధైర్య సహసాలు ఉన్నవారే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. రెండు కాళ్లకు ఒక బలమైన తాడు కట్టి చాలా ఎత్తు నుంచి దూకడాన్ని బంగీజంప్ అంటారు. దూకినప్పుడు చాలా వేగంగా తలకిందులుగా వెళ్తారు. దూకినప్పుడు భూమిని తగలకుండా మనిషి ఒకటికి రెండుసార్లు గాల్లో స్ప్రింగ్ యాక్షన్‌లా ఊగుతాడు. అందుకు తగట్టు తాడు ఉంటుంది.
అయితే జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్, తన న్యూ కష్కాయ్ (Qashqai) మోడల్‌ను బంగీజంప్ చేయించి వెరైటీ ప్రచారానికి తెరలేపింది. భారీ క్రెయిన్ సహాయంతో 213 అడుగుల ఎత్తు నుంచి ఈ అడ్వెంచర్‌ను నిర్వహించింది. ఈ కారు బంగీజంప్ గిన్నిస్ బుక్‌లో చోటుదక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.