కూసుమంచి, ఆంధ్రపత్రిక : దివ్యఖురాన్ రంజాన్ మాసంలో అవతరించింది. ఈనెలలోని 26వ రోజు రాత్రి ఖురాన్ అవతరించినట్లు మత పెద్దలు చెబుతుండగా ఆరోజున ‘షబ్ ఏ ఖదర్’ జరుపుకొంటారు.
రాత్రంతా జాగరణతో అల్లాప్రసన్నానికి ప్రార్థిస్తారు.
సహనం.. ఓపిక.. దైవ ఆరాధన.. దాతృత్వం.. మేళవించిన పవిత్ర మాసం రంజాన్ విచ్చేసింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల రంజాన్ గురువారం సాయం సంధ్యా సమయంలో వినీలాకాశంలో నెలవంక దర్శనంతో ప్రారంభమైంది. రంజాన్ నెలవంక దర్శించుకున్న ముస్లింలు ‘మాహే రంజాన్ ఆగయా..’ ముబారక్ అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా శుభాభివందనాలు తెలుపుకున్నారు.
నెలవంక దర్శనంతో ‘ఈదుల్ ఫితర్’
30 రోజుల ఉపవాస దీక్ష అనంతరం కనిపించే నెలవంక దర్శనంతో ఉపవాసాలను నిలిపివేసి మరుసటిరోజు ఈదుల్ఫితర్ పండగను ఘనంగా జరుపుకుంటారు.
సూర్యోదయానికి ముందు నుంచి సూర్యస్తమయం వరకు..
రంజాన్ మాసంలో 30 రోజులపాటు ఉపవాసం ఉంటారు. 12 ఏళ్ల వయస్సు దాటిన వయస్సు నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష పాటిస్తారు.. సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నిర్ణీత సమయానుకూలంగా దీక్ష పాటిస్తారు. తెల్లారక ముందే ‘సహర్’తో ప్రారంభమైన ఉపవాసం సూర్యాస్తమయం అయ్యాక ‘ఇఫ్తార్’తో రోజా ముగుస్తుంది. సుమారు 13 నుంచి 14 గంటలపాటు ఏవిధమైన ఆహారం, పండ్లు, ఫలహారాలు, టీ, శీతల పానీయాలు, తుదకు నీరు కూడా తాగకుండా కఠిన దీక్షను పాటిస్తారు. ప్రతి వ్యక్తిలో ఓపిక, సహనం, పేదల ఆకలి దప్పుల బాధ తెలియడం లక్ష్యంగా ఈ ఉపవాసం కొనసాగుతోంది.
ప్రత్యేక ‘తరావీహ్’ నమాజు ఆచరణ
ప్రతిరోజు ఐదు వేళల పాటించే నమాజుతోపాటు రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ‘తరావిహ్’ నమాజును ఆచరిస్తారు. ప్రతిరోజు రాత్రి ఇషా నమాజు అనంతరం ఈ తరావిహ్ నమాజు పాటిస్తారు. దివ్యఖురాన్లో 30 భాగాలు ఉండగా రంజాన్ మాసంలోని ప్రతిరోజు ఒక్కో భాగాన్ని ఈ ప్రత్యేక నమాజులో పఠిస్తారు.
దానధర్మాలకు ‘జకాత్’..
ప్రతి ముస్లిం తన సంపాదనలోని నికర ఆదాయంలో జకాత్ పేరిట పేదలకు దానం చేయడం ఇస్లాం విధి విధానాల్లో ఒక అంశం. నికర ఆదాయంలో నిర్ణయించిన మేరకు దానధర్మాలను పాటించకుంటే నరకం ప్రాప్తిస్తుందంటూ ఇస్లాం హెచ్చరిస్తుంది. దీంతో రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పేదవర్గాలు కూడా తమతో సమానంగా తినాలని, రంజాన్ పండగ జరుపుకోవాలనే లక్ష్యంతో ఆహార పదార్థాలు, దుస్తులు, ఇతర గృహోపకరణాలను పేదలకు దానం చేస్తుంటారు. రంజాన్ మాసంలో చేసే దాన ధర్మాలకు ఎక్కువ పుణ్య ఫలాలు లభిస్తుండటంతో ఈమాసాన్ని ఒక వేదికగా తీసుకొని పేదలకు ఆదుకునేందుకు ముందుకు వస్తారు. ఈనెలలోనే ప్రతీ వ్యక్తి ‘ఫిత్రా’ పేరిట పేదలకు నగదు లేదా గోదుమలు దానం చేస్తుంటారు.
* కలిమ.. (అల్లాపై విశ్వాసం కలిగి ఉండటం)
* నమాజ్ (ప్రతిరోజు ఐదు వేళలా నమాజు ఆచరించడం)
* రోజా (ఉపవాస దీక్ష పాటించడం)
* జకాత్ (తన సంపాదనలో మిగులు నుంచి కచ్చితంగా పేదలకు దానం చేయడం)
* హజ్ (జీవితంలో ఒక్క సారైనా మక్కా యాత్ర జరపడం)
ఇస్లాం దివ్యఖురాన్ ద్వారా మానవాళికి నిర్దేశించిన విధి, విధానాలివి.. వీటిలో రోజా(ఉపవాసాలు) రంజాన్ మాసంలో 30 రోజులపాటు పాటించాల్సినవి. ఉపవాసాల పాటింపుతోపాటు ఇస్లాం సూచించిన ఓపిక, సహనం, దైవారాధన, పేదలకు దాతృత్వమందించడం తదితర పుణ్యకార్యాల మేళవింపు.. ఈ రంజాన్.