చెన్నై: ధనాధన్ షాట్లతో జట్టుకు కావాల్సిన పరుగులను అందించడం ఫినిషర్‌గా తన బాధ్యతని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ 9 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.విజయానంతరం తన బ్యాటింగ్‌పై స్పందించిన ధోనీ.. తన ఆటతీరుపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా ఆడేందుకు నెట్స్‌లో చాలా కష్టపడ్డానని తెలిపాడు. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతనిలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారని కొనియాడాడు.సెకండాఫ్‌లో పిచ్‌పై మరింత టర్న్ లభించింది. ఇతర బౌలర్ల కన్నా మా స్పిన్నర్లు ఎక్కువ సీమ్‌ను ఉపయోగిస్తారనే విషయం మాకు తెలుసు. వికెట్ నెమ్మదిస్తుందని మేం భావించాం. వాస్తవానికి ఈ వికెట్‌పై మంచి స్కోర్ ఏంటో మాకు తెలియదు. అందుకే మా బౌలర్లను అత్యుత్తమ బంతులు వేయాలని చెప్పాను. ప్రతీ బంతిని వికెట్ కోసం ప్రయత్నించవద్దని తెలిపాను.వికెట్ కోసం ప్రయత్నిస్తే బౌలింగ్‌లో తప్పిదాలు జరుగుతాయి. 166-170 మంచి స్కోర్ అని నేను భావించా. కానీ బ్యాటింగ్ పరంగా మేం ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. మంచి విషయం ఏంటంటే జడేజా, మొయిన్ అలీలకు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. టోర్నీ చివరి దశలో ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరికి బ్యాటింగ్ చేసే అవకాశం రావడం, కనీసం కొన్ని బంతులైనా ఆడటం ముఖ్యం.
మా బ్యాటింగ్ పట్ల మేం సంతోషంగా ఉండాలి. మిచెల్ సాంట్నర్‌ను నేను బాగా ఇష్టపడుతాను. అతను ఫ్లాట్ వికెట్లపై కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. సీమ్‌ను హిట్ చేస్తూ మంచి పేస్‌ను రాబడుతాడు.రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగులు చేయడం మొదలుపెడితే అతను చాలా ఈజీగా ఆడుతాడు. పరిస్థితులకు తగ్గట్లు తన ఆటను మార్చుకుంటాడు. గేమ్ పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి. పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకుంటాడు. ఇలాంటి ఆటగాళ్లను చాలా అరుదుగా చూస్తుంటాం. రుతురాజ్ వంటి ప్లేయర్లు జట్టులో ఉండటం చాలా ముఖ్యం.
చివర్లో వచ్చి ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టుకు కావాల్సిన పరుగులు చేయడం నా బాధ్యత. నన్ను బాగా పరుగెత్తనివ్వకండని జట్టుకు ముందే తెలియజేశాను. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. జట్టు కోసం నేను ఇలానే ఆడాలనుకున్నాను. జట్టు కోసం పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది.’అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ధోనీతో పాటు శివమ్ దూబే(12 బంతుల్లో 3 సిక్స్‌లతో 25), అంబటి రాయుడు (17 బంతుల్లో బౌండరీ, సిక్స్‌తో 23) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. రిలీ రోసౌ(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35), మనీశ్ పాండే(29 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో మతీశ పతీరణ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కింది.