సింగపూర్,17,అక్టోబర్ (ఆంధ్రాత్రిక): ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికి సంస్కృతే ఒరవడి అని,సువిశాల దృక్పథం,ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి ప్రపంచానికి భవితవ్యాన్ని దిశానిర్దేశం చేయగలదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.మలేసియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన,సింగపూర్ లో తెలుగు కళలు,సంస్కృతిని కాపాడుకుని ముందు తరాలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీ సాంస్కృతిక కళాసారథి ద్వితీయ వార్షికోత్సవంలో ప్రసంగించారు. సంస్థ ఆశయం అభినందించదగినదని,దేశపు ఎల్లలు దాటి పరాయి దేశంలో మన భాష,సంస్కృతి, కళలు గౌరవాన్ని అందుకోవటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.గత రెండేళ్ళ కాలంలో సంగీత,నృత్య,సాహిత్య, ఆధ్యాత్మిక,నాటక,సంప్రదాయ కళారంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు, ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. మన భాషా సంస్కృతులను పరిరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సంస్థలన్నీ ఒకే వేదిక మీదకు రావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.నలుగురి ఆలోచనల సంగమం గొప్ప విజయాలను అందిస్తాయని పేర్కొన్నారు.ఈ దిశగా శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.ఈ దిశగా యువతలో చొరవ మరింత పెరగాలని ఆకాంక్షించారు. దసరా,దీపావళి పండుగల సందర్భంగా సింగపూర్ తెలుగు వారందరితో కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ‘‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొనడం మరింత శోభనిచ్చింది.ఆత్మీయ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కోశాధికారి వామరాజు సత్యమూర్తి హాజరయ్యారు.సింగపూర్ గాయని గాయకులచే సంప్రదాయక భక్తి గీతాలు,సాయి తేజస్వి మరియు అభినయ నృత్యాలయ వారి నృత్య ప్రదర్శనలు ,తేటతెలుగు పద్యాలాపనలు ప్రేక్షకులందరినీ అలరించాయి.శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ‘‘తమ సంస్థ 2020లో ప్రారంభమై గత రెండు సంవత్సరాలుగా సుమారు 40 కి పైగా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంస్థల సమన్వయంతో నిర్వహించిందని,తమ ద్వితీయ వార్షికోత్సవం వేడుకలను గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరుపుకోవాలని జూలై నుంచి ఎదురు చూస్తున్నామని ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని’’ ఆనందం వ్యక్తం చేశారు.సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గం రాధిక మంగిపూడి,రామాంజనేయులు చామిరాజు,భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్,రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల వెంకయ్యనాయుడును అభిమానపూర్వకంగా సత్కరించారు.సింగపూర్ తెలుగు ప్రజలను ఉద్దేశించి వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగం చక్కటి ఛలోక్తులతో సాగింది. తెలుగువారందరిలో స్ఫూర్తిని నింపేలా సాగిన ఆ వాగరి అందరినీ అలరించింది.ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని ప్రఖ్యాత తెలుగు సంస్థలు తెలంగాణ కల్చరల్ సొసైటీ,తెలుగు భాగవత ప్రచార సమితి,కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అనేక అభినందనలు అందుకుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!