Telangana University VC: సమాజంలో మార్పును తీసుకువచ్చే విధంగా.. బోధనలను, పరిశోధనలు అందించాల్సిన విశ్వవిద్యాలయాలు సైతం దారితప్పుతున్నాయి. యూనివర్సిటీల్లో చిన్న చిన్న సంఘటనలు జరగడం కామనే.. కానీ..
సమాజంలో మార్పును తీసుకువచ్చే విధంగా.. బోధనలను, పరిశోధనలు అందించాల్సిన విశ్వవిద్యాలయాలు సైతం దారితప్పుతున్నాయి. యూనివర్సిటీల్లో చిన్న చిన్న సంఘటనలు జరగడం కామనే.. కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అవినీతి విషయం రాష్ట్రంలో కలకలం రేపింది. ఉపకులపతిగా పనిచేస్తున్న వ్యక్తే.. అడ్డదారులు తొక్కి లంచం తీసుకోవడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా.. యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) వలకు చిక్కారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో రవీందర్ గుప్తా లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అయితే, గతవారం రవీందర్ పై ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి తనిఖీలు చేపట్టింది. ఆయన ఛాంబర్లో పలు గంటలపాటు సోదాలు నిర్వహించింది. అయితే, ఆ తనిఖీల్లో ఎలాంటి వివరాలు సేకరించారన్నది మాత్రం బయటకు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే.. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండల కేంద్రంలో పరీక్ష సెంటర్ అనుమతి ఇవ్వడానికి రూ.50,000 లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీసీ రవీందర్ గుప్తాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏసీబీ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
అయితే, తెలంగాణ ఉపకులపతి రవీందర్ గతంలో నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.