తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ షార్ట్ సర్క్యూట్. యస్..! ఉచిత విద్యుత్ అంశం మళ్లీ రచ్చ రేపుతోంది. ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి చేసిన కామెంట్లు మంటలు రాజేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోన్న వేళ ఈ ఉచిత విద్యుత్ ఇష్యూ.. పొలిటికల్ వెపన్‌గా మారనుందా..? ఈ పవర్ ఫైట్.. ఏ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారుతోంది..?
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ టాపిక్ మళ్లీ తెరమీదకొచ్చేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తోంది. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా చీకటిమయం అవుతుందన్న కిరణ్‌కుమార్‌రెడ్డి మాటల్ని గుర్తు చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారని.. ఇప్పుడా పరిస్థితి ఏపీలో ఉందని రివర్స్ కౌంటరిచ్చారు. బాబు, కిరణ్ వ్యాఖ్యల్నిగుర్తు చేసిన ఎర్రబెల్లి.. అప్పట్లో ఎగతాళి చేసినవాళ్లే నోరెళ్లబెట్టేశారన్నారు.ఇప్పుడు తెలంగాణ రూపు మారిందని.. ఏపీలోనే కరెంట్ కోతలు ఎక్కువంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.
తొర్రూరు లయన్స్ క్లబ్ – వాసవి క్లబ్ అధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ, పాత్రికేయ దినోత్సవాల్లో పాల్గొన్నారు ఎర్రబెల్లి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండురాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. ఇటు… మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా ఉచిత కరెంట్ సబ్జెక్ట్‌ని తిరగదోడేశారు. తెలంగాణాలో 24 గంటల ఫ్రీపవర్ ఇస్తున్నారని రుజువు చేయగలరా అని బీఆర్ఎస్కి బహిరంగ సవాల్ విసిరారు ఈటల. ఉచిత కరెంట్‌పై చర్చకు రావాలని, ఒకవేళ రాకపోతే తప్పుడు ప్రచారం మానుకోవాలని అధికార పార్టీపై ఎటాక్ చేశారు ఈటల. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలేంజ్ చేశారు ఈటల రాజేందర్.
బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ మరోసారి ఉచిత కరెంట్ అంశాన్ని లేవనెత్తడాన్ని నిశితంగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. మరోవైపు రైతుల సమస్యలపై కేసీఆర్‌ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ కేసీఆర్ హామీలను ఎండగట్టారు. అనగనగా ఓ కేసీఆర్ అంటూ మొదలుపెట్టి కథలు కంచికి- కేసీఆర్ ఫాంహౌస్ కి అంటూ ముగించారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. 150 ఎకరాల్లో వేశారని ఎద్దేవా చేశారు. రైతులకు ఫ్రీ ఎరువులు అని.. వారిని గంటల తరబడి క్యూలో నిలబెట్టాడని విమర్శించారు. 24 గంటల కరెంట్ అన్నారు… లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఈవిధంగా చాలా గ్యాప్ తర్వాత తెలంగాణాలో ఉచిత కరెంట్ హాట్‌టాపిక్‌గా మారింది. సింగిల్ లైన్లో చెప్పాలంటే, టోటల్ తెలంగాణ పొలిటికల్ పిక్చర్‌నే మార్చేలా కనిపిస్తోంది పవర్ ఫైట్. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోన్నవేళ ఈ ఉచిత విద్యుత్ ఇష్యూ.. పొలిటికల్ వెపన్‌గా మారే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.