అభ్యర్థుల విషయంలో ఎప్పుడూ లేనంత కసరత్తు జరుగుతోంది. నేతల చేరికలు, సమీకరణాల విషయంలో ఆచితూచి అడుగేస్తోంది కాంగ్రెస్‌పార్టీ. కాంగ్రెస్‌లో చేరికలు రేవంత్, కోమటిరెడ్డి మధ్య అగాధం పెంచాయా? నల్గొండజిల్లా సమీకరణాలు వీరి మధ్య గ్యాప్ పెంచుతున్నాయా? టీపీసీసీ చీఫ్ సైలెంట్‌గా పార్టీ ఎంపీని పక్కన పెడుతున్నారా? నేతలిద్దరూ కడుపులో కత్తులు పెట్టుకొని మొహాలపై నవ్వులు చిందిస్తున్నారా? దగ్గరయ్యారనుకుంటున్న ఆ ఇద్దరి మధ్యా మళ్లీ దూరం పెరుగుతోందా?
కర్నాటక కిక్కుతో తెలంగాణలోనూ జెండా ఎగరేయాలన్న టార్గెట్ తో ఉంది హస్తం పార్టీ. అందుకే అభ్యర్థుల విషయంలో ఎప్పుడూ లేనంత కసరత్తు జరుగుతోంది. నేతల చేరికలు, సమీకరణాల విషయంలో ఆచితూచి అడుగేస్తోంది కాంగ్రెస్‌పార్టీ. అయితే అభ్యర్థుల విషయంలో తెరవెనుక మాత్రం హైడ్రామా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాండేట్ల వ్యవహారం కాంగ్రెస్‌లో కొత్త వివాదాలు రాజేస్తోంది. అభ్యర్థులు ఎంపిక విషయంలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయట. కొన్నాళ్లుగా సఖ్యంగా ఉంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి- పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి మధ్య పార్టీలో చేరికలు చిచ్చుపెట్టాయంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మొదట్నించీ వ్యతిరేకిస్తూ వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే నల్లగొండలో జరిగిన నిరుద్యోగ నిరాహార దీక్ష ఆ ఇద్దరినీ కలిపింది. అప్పటినుంచీ నేతలిద్దరూ సన్నిహితంగానే ఉంటున్నారు. అయితే కొందరు నేతల చేరికలతో మళ్లీ రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయాయి.
స్టార్ క్యాంపెయినర్‌గా..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేరికలపై స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న తన అభిప్రాయం తీసుకోవాలని గతంలో పార్టీ నేతలకు చెప్పారు కోమటిరెడ్డి. యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్‌రెడ్డి పార్టీ వీడిన తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి, మందుల శామ్యూల్‌లకు కోమటిరెడ్డే చొరవ తీసుకొని పార్టీ కండువా కప్పారు. అయితే మరికొందరి చేరికను మాత్రం కోమటిరెడ్డి వ్యతిరేకించారు. ముఖ్యంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంని ఆయన మొదట్నించీ వ్యతిరేకిస్తున్నారు.
కోమటిరెడ్డితో విభేదించి పార్టీని వీడిన కుంభం అనిల్‌కుమార్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్‌రెడ్డి. అయితే కుంభం మళ్లీ పార్టీలోకొచ్చేదాకా ఆ విషయం కోమటిరెడ్డికి తెలియదట. భువనగిరి కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ చేశారని అనిల్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఎన్నికలముందు పార్టీ వీడిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట కోమటిరెడ్డి. దీంతో భువనగిరి రాజకీయంతో రేవంత్, కోమటిరెడ్డి మధ్య అగాధం మరింత పెరిగింది.
ఆగ్రహంతో రగిలిపోతూ..
మరోవైపు పొంగులేటి జోక్యంతో కాంగ్రెస్‌లో వేముల వీరేశం చేరికకు లైన్‌క్లియరైంది. తాను ఎంపీగా ఉన్న భువనగిరి నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండానే టీపీసీసీ చీఫ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహంతో రగిలిపోతున్నారట కోమటిరెడ్డి. వేముల వీరేశం చేరికతో వీరి మధ్య మళ్లీ పాత వైరం మొదలయ్యేలా ఉందని పార్టీలో టాక్.
ఇటీవలి పరిణామాలను గమనిస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాస్త పక్కన పట్టి.. రేవంత్ రెడ్డే నల్గొండ జిల్లా వ్యవహారాలు నడిపిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. సీనియర్ నేత, స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారని, పథకం ప్రకారమే టీపీసీసీ చీఫ్ సైలెంట్‌గా తన మార్క్ రాజకీయం చేస్తున్నారని కోమటిరెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం చేరికలతో రసకoదాయంలో పడిందని చెప్పొచ్చు.