తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. భారీ సభలు, సమావేశాలతో ప్రతిపక్షాలు ఎన్నికల హామీలు ప్రకటించేస్తున్నాయి. అయితే వాటికి కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్.. తాండూరులో పర్యటించిన హరీష్రావు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఫైరయ్యారు.
ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్ధులను సీఎం కేసీఆర్ ప్రకటించిన దగ్గర నుంచి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మరింత స్పీడ్ పెంచాయి. ఎవరి వ్యూహాల్లో వాళ్లు ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 6 గ్యారంటీలు ప్రకటించింది. అటు బీజేపీ కూడా పొలిటికల్ యాక్టివిటీ స్పీడప్ చేసింది. ఒక్క అవకాశం ఇస్తే.. అద్భుతమైన పాలన అందిస్తామంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికలు వచ్చే సరికి ఎవరెవరో వస్తున్నారు.. ఏవేవో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 65ఏళ్లుగా అధికారంలో ఉన్నా ఏమీ చేయని కాంగ్రెస్.. ఇప్పుడు పెద్ద పెద్ద హామీలిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిందనీ.. ఆ పార్టీని ఇప్పుడు ఎవరూ నమ్మేపరిస్థితి లేదన్నారు మంత్రి కేటీఆర్.
దేశం ఇంకా వెనకబడిపోవడానికి కాంగ్రెస్, బీజేపీనే కారణమన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే.. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్నే మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారనీ.. మోసపు మాటలు చెప్పే పార్టీలను నమ్మరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికారపార్టీ నేతలు.