సెకండ్ లిస్ట్ ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఎక్కువయ్యాయి. ఏకంగా పదికి పైగా నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు చెలరేగాయ్!. కొందరు రాజీనామాలకు డిసైడైతే, మరికొందరు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశాలకు సిద్ధమవుతున్నారు. దీంతో హస్తం పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఇలా వచ్చిందో.. లేదో.. సెకండ్ లిస్ట్ ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఎక్కువయ్యాయి. ఏకంగా పదికి పైగా నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు చెలరేగాయి కొందరు రాజీనామాలకు డిసైడైతే, మరికొందరు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశాలకు సిద్ధమవుతున్నారు. దీంతో హస్తం పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది.
తెలంగాణలో రాజకీయ రణక్షేత్రం రోజు రోజుకు పీక్స్‌కు చేరుతుంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టాప్ టు బాటమ్ నేతలంతా గ్రౌండ్లోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంపకం.. ఒక మెగా సీరియల్‌ని తలపిస్తోంది. అసంతృప్తులు, బుజ్జగింపులు వీటికి తోడు కొత్తగా చేరికలు.. కామ్రేడ్లతో తేలాల్సిన పొత్తు లెక్కలు.. ఇలా అభ్యర్థుల ఎంపిక అనేది ఎడతెగని పంచాయతీగా మారింది. లిస్టు రిలీజ్ చేయ్యగానే పార్టీలో అసమ్మతి బెంబేలెత్తిస్తోంది.
55 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ… మరో 45 మందితో రెండో జాబితాను ప్రకటించింది. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా కసరత్తు జరుగుతోంది. ఇదే ఎజెండాతో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో వాడీవేడిగా సాగింది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి మళ్లీ సమావేశమై జాబితాను ఫైనల్ చేసే ఛాన్సుంది. ముందే అనుకున్నట్టు రెండో జాబితాలో 60 నియోజకవర్గాలు ఖరారు కావడం లేదు. కాంప్లికేటెడ్ అనుకున్న కొన్ని స్థానాల్ని పెండింగ్‌లో పెట్టి.. మిగతా వాటితో మాత్రం సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది.
సెకండ్ లిస్ట్ ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఏకంగా 15 నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రాజుకున్నాయి. కొందరు నేతలు రాజీనామాలకు సైతం సిద్ధమవుతున్నారు. దీంతో హస్తం పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. ఈ క్రమంలోనే జడ్చర్ల లేదంటే నారాయణపేటలో ఏదో ఒక సీటు వస్తుందని ఎర్ర శేఖర్ ఆశపడ్డారు. కానీ ఎక్కడా టికెట్ దక్కకపోవడంతో అనుచరులతో సమావేశానికి రెడీ అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు సంకేతాలు పంపారాయన.
ఇక ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో బోరున విలపించిన సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రెబల్‌గా పోటీ చేయడమే కాకుండా రేవంత్‌ని సైతం ఓడిస్తానని శపథం చేశారాయన. నర్సాపూర్ టికెట్ ఆశించిన గాలి అనిల్‌కి భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
ఇక హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసిన బల్మూరి వెంకట్.. ఈసారి కూడా టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ వొడితెల ప్రణవ్‌ని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. దీన్ని ఊహించని బల్మూరి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌కి టికెట్ రావడంతో ప్రవీణ్ రెడ్డి నిరాశలో ఉన్నారు. ఇక పాలకుర్తి టికెట్ యశశ్వినికి దక్కింది. దీంతో ఇక్కడ తిరుపతిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాబూబాబాద్‌లో బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ వీళ్లిద్దరినీ కాదని.. మురళీనాయక్కి పార్టీ టికెట్ ఇచ్చింది.
జూబ్లీహిల్స్ టికెట్ తనకే దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి. కానీ అజారుద్దీన్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీంతో అధిష్టానం పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు విష్ణు. అంబర్ పేట్ టికెట్ కోసం నూతి శ్రీకాంత్, మోతె రోహిత్ పోటీ పడ్డారు. కానీ ఈ సీటు రోహిన్‌రెడ్డి ఎగరేసుకుపోయారు. దీంతో ఆ ఇద్దరు నేతలు డైలమాలో పడ్డారు. మహేశ్వరం టికెట్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి దక్కింది. దీంతో పారిజాత నర్సింహారెడ్డికి నిరాశే మిగిలింది.
దేవరకొండ టికెట్ నేనావత్ బాలూనాయక్కి దక్కడంతో రమేష్ నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. ఇక మునుగోడు టికెట్ విషయంపై ఇద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పాల్వాయి స్రవంతి, ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేసిన కృష్ణారెడ్డిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే సీటు ఇచ్చింది అధిష్టానం. పార్టీలు మారే వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు ఈ ఇద్దరు నేతలు.
ఇవే కాకుండా ఇంకా చాలా నియోజకవర్గాల్లో సీటు దక్కని నేతలు పార్టీ నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వీళ్లలో పలువురు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు.