బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని నెలకొల్పిన కాన్షీరాం వర్ధంతి. సరిగ్గా అదే రోజు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. మరి దళిత చైతన్యం ఇప్పుడెలా ఉంది? గత కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో పెద్దగా కనిపించని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాదు హిందీ మాట్లాడే ఇతర రాష్ట్రాల్లోనూ దళిత బహుజన సమాజంలో గట్టి పట్టున్న బీఎస్పీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది..
దళిత వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని నెలకొల్పిన కాన్షీరాం వర్ధంతి. సరిగ్గా అదే రోజు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. మరి దళిత చైతన్యం ఇప్పుడెలా ఉంది? గత కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో పెద్దగా కనిపించని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాదు హిందీ మాట్లాడే ఇతర రాష్ట్రాల్లోనూ దళిత బహుజన సమాజంలో గట్టి పట్టున్న బీఎస్పీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది అన్న విషయాలు ఇప్పుడు ఉత్తరాదిలోనే కాదు.. తెలంగాణలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఎందుకంటే.. దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధపడే సైన్యం మాదిరిగా ‘స్వేరోస్’ సొంత సైన్యాన్ని తయారుచేసుకున్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ బహుజన పార్టీకి సారధిగా ఉన్నారు. ఎన్నికల్లో సీట్లు గెలుస్తారా లేదా అన్న విషయం కాసేపు పక్కనపెడితే ప్రభావవంతమైన ఓటుబ్యాంకును చీల్చగలిగే సామర్థ్యం ఉందన్న అంచనాలున్నాయి.
మధ్యభారతంలో మాయాజాలం
వచ్చేనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కింగ్‌మేకర్ కావాలని మాయావతి భావిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రత్యక్ష పోరు కనిపిస్తున్నప్పటికీ.. రాజస్థాన్‌లోని భరత్పూర్, జుంజును, అల్వార్, బికనీర్ వంటి ప్రాంతాల్లో బీఎస్పీకి పట్టుంది. అలాగే మిగతా రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో దళిత ఓట్లను ఆమె ప్రభావితం చేయగలరు. అందుకే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొన్ని స్థానిక పార్టీలతో ఎన్నికల మాయావతి పొత్తు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లు, రాజస్థాన్‌లో ఆరు సీట్లుఛత్తీస్గఢ్లో రెండు సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ సాధించలేకపోయిన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కింగ్‌మేకర్‌గా అవతరించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు బీఎస్పీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది. కానీ ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మారి కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, బీఎస్పీ ఎమ్మెల్యేలు మొదట వారికి మద్దతిచ్చారు. ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తరువాత బీజేపీలో చేరారు. ఈసారి సొంత స్కోర్ మరింత పెంచుకుని, హోరాహోరీ పోరులో ఎవరికీ పూర్తి మెజారిటీ రానిపక్షంలో గేమ్ ఛేంజర్‌గా మారాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి భావిస్తున్నారు.
ఏక్లా చలో’ ఫార్ములాతో..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఓవైపు, సుమారు 30 పార్టీల సమాహారంగా మారిన ఇండి కూటమి మరోవైపు ఉండగా.. ఏ కూటమిలోనూ లేకుండా లోక్‌సభ ఎన్నికలకు ‘ఏక్లా చలో’ ఫార్ములాతో మాయావతి ముందుకెళ్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికొచ్చేసరికి మాత్రం ఆమె భిన్నమైన వ్యూహం రచించారు. అవసరమైతే ఎన్నికల తర్వాత బీఎస్పీ ప్రభుత్వంలో చేరవచ్చని ఆమె ఇప్పటికే ప్రకటించారు. జూలై చివరలో, మాయావతి ఢిల్లీలో ఎన్నికల రాష్ట్రాల నాయకుల సమావేశాన్ని పిలిచారు. ఈ భేటీ తర్వాతే మాయావతి తన స్టాండ్ మార్చుకున్నారు.
సాధారణంగా మాయావతి ఎన్నికల ముందు అలాంటి వైఖరిని కలిగి ఉండరు, కానీ ఈసారి ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అధికార సమతూకం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం అటువంటి బలవంతపు ప్రభుత్వంలో చేరడం ద్వారా దళితులు, గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయవచ్చని ఆమె సూత్రీకరిస్తున్నారు. ఇది మాయావతి రాజకీయ గురువు కాన్షీరామ్ సూత్రం. ఈ వ్యూహం ప్రకారం, బీఎస్పీ మొదట ఎస్పీతో చేతులు కలిపి, ఆపై బీజేపీతో చేతులు కలిపి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాయావతి ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాన్షీరామ్ సూత్రాన్ని ప్రయత్నించాలనుకుంటున్నారు.
తృతీయ శక్తిగా…
రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీఎస్పీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. దీంతో మాయావతి కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అశోక్ గెహ్లాట్ కూడా బీఎస్పీ ఎమ్మెల్యేను మంత్రిని చేశారు. ఈసారి బీఎస్పీ నేతల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాత కాంగ్రెస్, బీజేపీలకు పోటీగా తమ పార్టీ మూడో శక్తిగా అవతరించగలదని మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ దళితులకు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉండడమే ఇందుకు కారణం. హోరాహోరి పోరులో హంగ్ ఫలితాలు వస్తే.. ఈసారి బయటి నుంచి మద్దతివ్వడానికి బదులు ప్రభుత్వంలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. మాయావతి గతంలోచేసిన తప్పులను పునరావృతం చేయానుకోవడం లేదు. అందుకే ఆమె దృష్టి మొత్తం అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రీకరించి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి మాయావతి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ఆమె తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు ఎన్నికల బాధ్యతను అప్పగించారు. బీఎస్పీలో నంబర్ టూ, ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాష్ అక్కడ నిరంతరం రోడ్ షోలు చేస్తున్నారు.
ప్రచార రంగంలోకి..
రాజస్థాన్‌లో తమకు పట్టున్న భరత్పూర్, జుంజును, అల్వార్, బికనీర్ వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ ఇప్పటి వరకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోనూ శరవేగంగా పర్యటనలు, ర్యాలీలు నిర్వహిస్తూ బీఎస్పీకి అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో ఆకాష్ ఆనంద్ బిజీగా ఉన్నారు. అతి త్వరలో మాయావతి రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా అడుగు పెట్టనున్నారు. 2008, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవసరమైన మెజారిటీ రాలేదు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆరుగురు బీఎస్పీ నేతలు గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. సిఎం అశోక్ గెహ్లాట్ రెండుసార్లు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అందుకే మాయావతి ఈసారిమరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని, అవసరమైతే ప్రభుత్వంలో చేరాలని, తద్వారా తన ఎమ్మెల్యేలు అధికారం కోసం పార్టీ వీడి వెళ్లిపోవాల్సిన పరిస్థితి లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు.
మాయావతి వ్యూహం..
మిజోరం మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గోండ్వానా గణతంత్ర పార్టీతో మాయావతి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ 178 స్థానాల్లో, గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ) 52 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దళిత, గిరిజన ఓటర్లు కలిసి ఈ కూటమి భవితవ్యాన్ని మార్చగలరన్నది మాయావతి వ్యూహం. మధ్యప్రదేశ్‌లో దళిత, గిరిజన ఓటర్లు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యహోరాహోరీ పోటీలో ఏ ఒక్కరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి పునరావృతమవుతుందని మాయావతి భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య సమఉజ్జీ ఉంటుందని, హోరాహోరీ పోరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని మాయావతి స్కెచ్ వేశారు. ఛత్తీస్‌గఢ్‌లో గోండ్వానా గణతంత్ర పార్టీతో పొత్తులో భాగంగా బీఎస్పీ 53, జీజీపీ 37 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి పార్టీతో మాయావతి పొత్తు పెట్టుకున్నారు. అప్పుడుబీఎస్పీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) ఐదు స్థానాల్లో విజయం సాధించింది.
ఒంటరిగానే ఎన్నికల్లో..
రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఎవరితోనూ పొత్తు లేకుండా బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తోందని, ఈ రెండు రాష్ట్రాల్లోనూ మంచి ఫలితాలు వస్తాయంటూ మాయావతి ట్వీట్ చేశారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరుతో పాటు హైదరాబాద్ నగరం, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బీజేపీతో ముక్కోణపు పోటీ ఉంటుందని మాయావతి భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల కంటే రాజకీయ చైతన్యం పాళ్లు ఎక్కువగా ఉన్న తెలంగాణలో దళిత, బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాధించుకున్న సొంత ఇమేజికి,
మాయావతి బలం, బీఎస్పీ గుర్తు తోడైతే రిజర్వుడు నియోజకవర్గాల్లోనైనా గట్టి ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. సీట్లతో పాటు గణనీయమైన ఓటుబ్యాంకు సాధిస్తే.. సార్వత్రిక ఎన్నికల సమయానికి జాతీయ పార్టీలు తమతో పొత్తుకోసం వెంటపడే పరిస్థితి ఏర్పడుతుంది.
సార్వత్రిక ఎన్నికలకు బాటలు వేస్తూ..
మాయావతి ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవరు. తానే ట్రెండ్ సెట్ చేయాలని చూస్తారు. 2022లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆమె కష్టతరమైన దశను ఎదుర్కొంటున్నారు. బీఎస్పీ పొలిటికల్ గ్రాఫ్ నిరంతరం పడిపోవడంతో పాటు పార్టీలో బలమైన నేతలుగా పేరున్నవారు సైతం వీడి వెళ్లిపోయారు. యూపీలో బీఎస్పీ బలం 13 శాతం ఓటుబ్యాంకుతో ఒక ఎమ్మెల్యేకు పరిమితమైంది. అటువంటి పరిస్థితిలో, బీఎస్పీఏదైనా కూటమిలో భాగమైతే, మాయావతి ఏ ప్రాతిపదికన బేరం చేయాలి? అందుకే ఆమె ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించే ఫలితాల ఆధారంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు బేరసారాల్లో తన ధర పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే అవి భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తాయి. రాజకీయాల్లో ఒక్క పందెం మొత్తం ఆటనే మార్చేస్తుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మాయావతికి గేమ్ ఛేంజర్‌గా మారతాయో లేదో ఎవరికి తెలుసు?