తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 15 స్థానాలకు 312 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నాంపల్లి నుంచి అత్యధికంగా 34 మంది అభ్యర్థులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి అత్యల్పంగా 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎట్టకేలకు బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో ప్రచారంలో దూకుడు పెంచాయి రాజకీయ పార్టీలు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాలకు 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 15 స్థానాల పరిధిలో 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నాంపల్లి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 31, మలక్పేట్, యాకుత్ పురా నుంచి 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి 25 మంది, సికింద్రాబాద్ నుంచి 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సికింద్రాబాద్కంటోన్మెంట్ నుంచి అత్యల్పంగా 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 173 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీనగర్లో 38 మంది, మహేశ్వరంలో 27, రాజేంద్రనగర్లో 25, శేరిలింగంపల్లిలో 33, చేవెళ్లలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తెలంగాణ అంతటా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రికోణ పోటీ ఉంది. హైదరాబాద్లో మాత్రం ఎంఐఎం కారణంగా చతుర్ముఖ పోటీ నెలకొంది. చార్మినార్, యాఖుత్పురా, చాంద్రాయణగుట్ట, మలక్పేట్, కార్వాన్, బహదూర్పురా, నాంపల్లి నియోజకవర్గాల్లో కొన్నేళ్లుగా ఎంఐఎందే పైచేయిగా ఉంటోంది. దీనికి తోడు తమ పార్టీని విస్తరించుకునే క్రమంలో భాగంగా ఎంఐఎం ఈసారి అదనంగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రత్యేకించి గోషామహల్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్పైనా దృష్టిసారించింది ఎంఐఎం. తమ అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్కు మద్దతిస్తామన్న ఎంఐఎం ఇప్పటికే ప్రకటించింది. అయితే జూబ్లీహిల్స్లో మాత్రం బీఆర్ఎస్పై స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
మరోవైపు నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులు ఇలా వరుస క్రమంలో అభ్యర్థుల జాబితా రూపొందించి వాటి ఆధారంగా బ్యాలెట్ ఖరారు చేసి పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.