తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అయితే, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో చేరికలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య అగాధం పెంచాయా..? వీరి మధ్య అభిప్రాయ బేధాలు తార స్థాయికి చేరాయా..? రేవంత్ రెడ్డి సైలెంట్‌గా కోమటిరెడ్డిని పక్కకు పెడుతున్నారా? నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని మోములో నవ్వులు పూయిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అయితే, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో చేరికలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య అగాధం పెంచాయా..? వీరి మధ్య అభిప్రాయ బేధాలు తార స్థాయికి చేరాయా..? రేవంత్ రెడ్డి సైలెంట్‌గా కోమటిరెడ్డిని పక్కకు పెడుతున్నారా? నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని మోములో నవ్వులు పూయిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్ణాటక గెలుపుతో.. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి తీవ్ర కసరత్తు చేస్తున్నారు నేతలు. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ మార్క్ హై డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగాభావిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా అభ్యర్థులు ఎంపికలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయట. రాష్ట్ర కాంగ్రెస్ లోని రాజకీయ ఉద్దండులంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్న రేవంత్ రెడ్డి- కోమటిరెడ్డిల మధ్య ఇటీవలి చేరికలు చిచ్చుపెట్టాయని సమాచారం..
పిసిసి అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డిని ఆది నుంచి కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే నల్లగొండలో జరిగిన నిరుద్యోగ నిరాహార దీక్షలో ఇద్దరు నేతలు కలిసిపోయి సఖ్యతగా ఉంటున్నారు. అయితే వీరి మధ్య ఇటీవల పార్టీలో చేరికలు, టికెట్ కేటాయింపు విషయంలో అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేరికలపై స్టార్ క్యాంపెనర్ గా ఉన్న తన నిర్ణయం తప్పకుండా తీసుకోవాలని గతంలో పార్టీ నేతలకు కోమటిరెడ్డి చెప్పారు. యాదాద్రి డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి, మందుల సామేలు విషయంలో కోమటిరెడ్డే చొరవ తీసుకొని పార్టీ కండువా కప్పారు. కాగా, మరి కొంత మంది కీలక నాయకుల విషయంలో మాత్రం కోమటిరెడ్డి వ్యతిరేకత చూపించారు. ముఖ్యంగా నకిరేకల్మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలో చేరడానికి కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు.
తనను విమర్శించి పార్టీని వీడిన కుంభం అనీల్ కుమార్ రెడ్డిని.. రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా రంగoలోకి దిగి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంభం అనిల్ పార్టీలో చేరే వరకు కోమటిరెడ్డికి అసలు విషయమే తెలియదట. భువనగిరి కాంగ్రెస్ టికెట్ ను కూడా కన్ఫామ్ చేశారని అనిల్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. కీలక సమయంలో పార్టీ వీడిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారట. దీంతో భువనగిరి రాజకీయంతో రేవంత్, కోమటిరెడ్డి మధ్య అగాధం మరింతగా పెరిగిందట. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. రేపు మాపో ఆయన కూడాకాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని కోమటిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారట. వేముల వీరేశం చేరికతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని పార్టీలో టాక్. ఇటీవలి పరిణామాలు గమనిస్తే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాస్త పక్కన పట్టి.. రేవంత్ రెడ్డే నల్గొండ జిల్లా వ్యవహారాలు నడిపిస్తున్నట్లు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేత స్టార్ క్యాంపెనియర్ గా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారని, పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి సైలెంట్‌గా కోమటిరెడ్డిని పక్కకు పెడుతున్నారని కోమటిరెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయంరసకందాయంలో పడిందని చెప్పవచ్చు.