నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా.. కాంగ్రెస్ టికెట్ల కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ దిగ్గజాలన్ని ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్లో పెట్టినా మూడు స్థానాలు సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మూడు స్థానాలల్లో పోటీ చేసే కాంగ్రెస్…
రాజకీయ దిగ్గజాలు ఉన్న ఆ జిల్లాలో ఇంకా మూడు కాంగ్రెస్ టికెట్లపై ఉత్కంఠ కొనసాగుతోందా..? ఎందుకు ఆ మూడు స్థానాలను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది..? ప్రత్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నా టిక్కెట్ల ఖరారు జాప్యంతో క్యాడర్ అయోమయంలో పడిందా..? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది..? రాజకీయ దిగ్గజాలు ఏమంటున్నాయి..? లాంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా.. కాంగ్రెస్ టికెట్ల కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ దిగ్గజాలన్ని ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్లో పెట్టినా మూడు స్థానాలు సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మూడు స్థానాలల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై అందరు దృష్టిని ఆకర్షిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ మూడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. తొలి, మలి విడతల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి జిల్లాలోని 9స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఈ మూడు సీట్లపై ఇప్పటికే పలు దఫాలుగా స్క్రీనింగ్ కమిటీ, కేంద్రఎన్నికల కమిటీలో చర్చించినా నాయకులు ఎటువంటి నిర్ణయం తీసుకో లేకపోయారు.
సూర్యాపేటలో టికెట్ ఫైట్..
మూడున్నర దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా ఉన్న దామోదర్ రెడ్డి ఇప్పటిదాక పార్టీ లైన్ దాటలేదనే పేరు ఉంది. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ప్రధానంగా సూర్యాపేటలో బీఆర్ఎస్ తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ ఎవరిని బరిలో నిలుపుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే రెండుసార్లు ఓటమిచెందిన దామోదర్ రెడ్డి కాకుండా రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని రేవంత్ వర్గం పట్టుబడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి కాంగ్రెస్ సీనియర్లు మాత్రం దామోదర్ రెడ్డికి ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందోన్న ఆసక్తి నెలకొంది. టికెట్ కోసం ఆశావాహులిద్దరూ ఢిల్లీలో మకాం వేశారు.
పీఠముడి వీడని తుంగతుర్తి..
ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తిపై కూడా పీఠముడి వీడడం లేదు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పదిహేనేళ్లుగా ప్రాతినిధ్యం కోల్పోయింది. ఈ టికెట్ కోసం కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ఆశావహులున్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో ఓటమిపాలైన అద్దంకి దయాకర్ మరోసారి టికెట్ సాధించి తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు కూడా తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మందుల సామేల్, నగరిగారి ప్రీతం, పిడమర్తి రవి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ స్థానానికి అభ్యర్థి ఖరారు బాధ్యతను ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్కుఅప్పగించారు. ఈ నియోజక వర్గంపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి గట్టిపట్టు ఉంది. ఇక్కడి నుంచి టికెట్ ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తిగా కేడర్ ఎదురు చూస్తోంది.
మిర్యాలగూడపై ఉత్కంఠ..
ఉత్కంఠ రేపుతున్న మరో స్థానం మిర్యాలగూడ. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు లేదన్నట్లుగా తేలిపోయింది. ఇన్నాళ్లూ పెండింగ్లో పెట్టిన మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు పొత్తులలో భాగంగా సీపీఎంకు ఈ స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. పొత్తు చిత్తు కావడంతో అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక్కడి నుంచి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు.
ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలిద్దరూ బీఎల్ఆర్కు అనుకూలంగా స్క్రీనింగ్ కమిటీ చర్చలో మద్దతు పలికారు. అనూహ్య పరిణామాలు ఏర్పడితే తప్పితే బీఎల్ఆర్ పోటీలో నిలిచే అవకాశం ఉంది. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావును ఢీకొట్టేందుకు కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దించుతుందోనని ఆసక్తిగా కేడర్ చూస్తోంది. మొత్తంగా మూడు నియోజకవర్గాల్లో నెలకొన్న టికెట్ల పంచాయితీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.