రాష్ట్రంలో ఎన్నికల వేడితో పాటు యాదాద్రి పవర్ ప్లాంట్ రాజకీయ మంటలను రేపుతోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు ముందే నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. పవర్ ప్లాంట్ కు అనుమతులు ఇచ్చాకే రాష్ట్ర పర్యటనకు రావాలని ప్రధాని మోడీకి ..
రాష్ట్రంలో ఎన్నికల వేడితో పాటు యాదాద్రి పవర్ ప్లాంట్ రాజకీయ మంటలను రేపుతోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు ముందే నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. పవర్ ప్లాంట్ కు అనుమతులు ఇచ్చాకే రాష్ట్ర పర్యటనకు రావాలని ప్రధాని మోడీకి .. రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. టిఓఆర్ తో సంబంధం లేకుండా పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి టీవోఆర్ జారీ చేయాలని ఎన్జీటీ ఆదేశంపై కేంద్ర పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ పవర్ ప్లాంట్ ప్రారంభానికి అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ సర్కార్.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. టీఓఆర్ తో ప్రమేయం లేకుండా ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని జెన్కో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మరోసారి పిటిషన్ వేసింది.
విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసి మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ (YTPS)ను నిర్మిస్తోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్లకు జూన్ 26, 2017న కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. అదే ఏడాది అక్టోబరు 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో జెన్ కో నిర్మాణం ప్రారంభించి.. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఇఎల్)కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద థర్మల్‌పవర్ ప్లాంటుగా మారనుంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పవర్ ప్లాంట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్‌పాండ్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపులైన్ పనులు, రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ కూడా నిర్మిస్తున్నారు. రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేలా అధికారులు సిద్దం చేశారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించిన పనులు 80 శాతానికి పైగా పూర్తి చేశారు.
ఈ నేథ్యంలో YTPSకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ముంబయికి చెందిన కన్సర్వేషన్ యాక్షన్ ట్రస్ట్, విశాఖకు చెందిన సమత అనే స్వచ్ఛంద సంస్థలు కేసు వేశాయి. దీంతో ఎన్జీటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని నిలిపివేసింది. యాదాద్రి ప్లాంటు నిర్మాణంపై విచారణ జరిపిన ఎన్జీటీ.. ప్లాంట్ వల్ల ఆ ప్రాంతంలో ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) జారీ చేయాలని గత అక్టోబర్ లో కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. నిర్దేశిత 9 నెలల గడువు గత జూన్ 30తో ముగిసినా కేంద్ర పర్యావరణ శాఖ టీఓఆర్‌ను జారీచేయలేదు.టీఓఆర్ జారీ చేయాలని తెలంగాణ జెన్కో పలుమార్లు పర్యావరణ శాఖకు లేఖ రాసినా స్పందించలేదు.
టీఓఆర్ లేకుండా ఈ విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించడానికి వీల్లేదని గతంలో ట్రైబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. 34 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా వెచ్చించామని జెన్కో అధికారులు చెబుతున్నారు. టిఓఆర్ తో సంబంధం లేకుండా పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని జెన్కో ఎన్జీటీలో మరోసారి పిటిషన్ వేసింది. డిసెంబర్ లోగా YTPS లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని జెన్కో అధికారులు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగానికివెన్నెముక లాంటి యాదాద్రి విద్యుత్ కేంద్రానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయకుండా జాప్యం చేస్తే.. తెలంగాణకే కాదు మొత్తం దేశానికి నష్టమని తెలంగాణ సర్కార్ చెబుతోంది. టీఓఆర్ కు సంబంధం లేకుండా విద్యుత్ ఉత్పత్తికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. రాష్ట్రంలో అడుగు పెట్టక ముందే యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కు అనుమతులు ఇవ్వాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారుతుందనే కొందరు యాదాద్రి ప్లాంట్ పై కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. కావాలనే ఆటంకాలు సృష్టించి అనుమతులు ఇవ్వకుండా.. ప్లాంట్ ను ప్రజలకు అందుబాటులోకి రాకుండా ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్జిటి ఆదేశాలను కేంద్ర పర్యావరణ శాఖ బేఖాతరు చేస్తుందని ఆయన ఆరోపించారు. అన్ని చట్టాలకు లోబడి ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.