రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటన చేయాలని ఆ పార్టీ సీనియర్ నేతలు పలువురు.. జాతీయ నాయకత్వాన్ని కోరారు.
బీజేపీ అధిష్ఠానాన్ని కోరిన రాష్ట్ర నేతలు
కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆ చాన్స్ లేదు
మనం ప్రకటిస్తే మంచి ఫలితాలొస్తాయి
మాజీ ప్రజాప్రతినిధుల భేటీలో వెల్లడి
బండి సంజయ్‌ని తప్పించిన విధానం బాగా లేదు
మాజీ ప్రజాప్రతినిధుల సమావేశంలో నేతల వెల్లడి
హైదరాబాద్, జూలై andhrapatrika : రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటన చేయాలని ఆ పార్టీ సీనియర్ నేతలు పలువురు.. జాతీయ నాయకత్వాన్ని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎలాగూ బీసీ వ్యక్తిని సీఎంను చేసే అవకాశం లేదని, రాష్ట్ర జనాభాలో బీసీ జనాభా 50 శాతానికి పైగా ఉన్నందున.. ఇందుకనుగుణంగా బీజేపీ బీసీ కార్డును ప్రయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని వారు అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు పలువురు సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు ఈ ప్రతిపాదన చేశారు. దీనికి పలువురు బీసీయేతర నేతలు కూడా మద్దతు పలికినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలను పలువురు నేతలు వివరించారు. కవితను అరెస్టు చేయకపోవడం వల్ల పార్టీ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లాయని పేర్కొన్నారు. ‘‘కవిత పేరును కేంద్ర మంత్రులే ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. దీనిని క్యాడర్ విశ్వసించింది. క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కూడా చేసింది. కానీ, దర్యాప్తు సంస్థలు ఆమెను రెండు మూడుసార్లు విచారించి అరెస్టు చేయకపోవడంతో ఏదో జరిగిందన్న సంకేతాలు జనంలోకి వెళ్లాయి. కవితను అరెస్టు చేస్తేనే కొంతమేర విశ్వాసం కలిగే అవకాశం ఉంది’’ అని వారు అభిప్రాయపడ్డారు.
సంజయ్‌ని తప్పించిన విధానం సరిగా లేదు
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించిని విధానం సరిగా లేదని పలువురు సీనియర్ నాయకులు బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అధ్యక్షుడిని మార్చే ముందు పార్టీలో అభిప్రాయాలు తీసుకునేవారని, ఇప్పుడు ఆ విధానాన్ని ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు. ‘‘సంజయ్‌ని ఎందుకు తప్పించారో కారణం చెప్పలేదు.. ఆయన్ను తప్పించిన విధానం క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు పంపింది. పార్టీ సంస్థాగత ప్రక్రియలో అధ్యక్షుడి మార్పు తప్పు కాదు కానీ, దానికంటూ ఒక విధానం ఉండేది. ఇప్పుడు దానిని కొనసాగించకుండా.. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా లాబీయింగ్ చేస్తే బీజేపీలో కూడా అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారం కిందిస్థాయి కార్యకర్తల్లో విస్తృతంగా జరుగుతోంది’’ అని వివరించారు. దీనిపై స్పందించిన జాతీయ నాయకత్వం.. సంజయ్ సేవలను కచ్చితంగా సమర్థంగా వినియోగించుకుంటామని చెప్పినట్లు సమాచారం. కాగా, రాష్ట్ర పార్టీలో చోటుచేసుకున్న ఘటనలతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని మరికొందరు నాయకులు చెప్పారు. అయితే దీనిని పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇన్చార్జి ప్రకాశ్ జావడేకర్, సహ ఇన్చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తోసిపుచ్చారు.
కిషన్‌రెడ్డి అందుబాటులో లేకపోతే ఇంద్రసేనా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బిజీ షెడ్యూలుతో అందుబాటులో ఉండలేకపోతే పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అందుబాటులో ఉంటారని బన్సల్ తెలిపారు. ఎన్నికలకు గడువు ఎంతో దూరం లేనందున ఆశావహులంతా వారి నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 మంది ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావడంలో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించి 22 కమిటీలు ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది.
స్థానిక సమస్యలపై పోరాడండి: కిషన్‌రెడ్డి
స్థానిక సమస్యలపై బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని, అందరం టీం వర్క్‌గా పనిచేద్దామని సూచించారు.