Telangana: రుణమాఫీకి మరో డెడ్‌లైన్.. కాంగ్రెస్‌లో సెంటిమెంట్..! ఆ నేతల నోట అదే మాట..
ANDHRAPATRIKA : –
సెంబర్ 9.. కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చే సెంటిమెంట్. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకైతే ఈ డేట్‌తో ఎటాచ్మెంట్ మరీ ఎక్కువ. మేడమ్ సోనియాగాంధీ పుట్టినరోజు.
పైగా.. రేవంత్ రెడ్డి సర్కారు కొలువు దీరిన రోజు. ప్రభుత్వంలోకొచ్చాక మరోసారి డిసెంబర్9 సెంటిమెంట్‌ను సాలిడ్‌గా టేస్ట్ చెయ్యబోతోంది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ అరకొరగా జరిగిందన్న ఆరోపణల్ని గట్టిగా తిప్పికొట్టాలని భావించి.. దానికి డిసెంబర్9నే ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. రైతు ఓటుబ్యాంకు చేజారకుండా జాగ్రత్తపడుతోంది.
రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, డిసెంబర్ 9 లోగా మిగతా వారందరికీ మాఫీని వర్తింపజేస్తామని పదేపదే చెబుతూ వస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పవర్‌ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రులు.. సందర్భం కాకపోయినా.. రైతుపాటనే గట్టిగా పాడారు. వ్యవసాయరంగానికి బడ్జెట్లో 73 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణాయేనని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు రుణమాఫీ అమలు చేసిన ఘనత తమదేనన్నారు. 18 వేల కోట్లు 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేసింది మేమే అని గర్వంగా చెప్పుకున్నారు. ఇక్కడితోనే ఆగలేదు. రుణమాఫీలో సాంకేతిక లోపాల్ని సరిచేసి.. త్వరలో లబ్దిదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మాటిచ్చారు భట్టి.
అదే వేదికపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా.. ఇదే మాటకు కోరస్ ఇచ్చారు. మేం రైతు పక్షపాతులం.. అంటూ అన్నదాతల్ని ప్రసన్నం చేసుకోబోయారు. అటు.. సిఎం రేవంత్ రెడ్డిని విప్లవనాయకుడితో పోల్చి మరో అడుగు ముందుకేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం రేవంత్‌రెడ్డి ఇందిరాగాంధీలా కృషి చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా రేవంత్‌రెడ్డికి ఉందని చెప్పారు మల్లు.
ఏదైతేనేం.. ఈసారి డిసెంబర్9ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనే పట్టుదలతో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ ఒక్కటే కాదు.. భవిష్యత్తులో రైతుల పంట బీమా కూడా ప్రభుత్వమే కడుతుందని మాటిస్తున్నారు మంత్రులు. ఈ విధంగా.. యావత్ తెలంగాణ రైతాంగం తమవైపే.. అని శత్రుపార్టీలకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తోంది రేవంత్ సర్కార్..