నేడు విశాఖలో టిడిపి ప్రాంతీయ సదస్సు
మినీ మహానాడు తరహాలో సదస్సు ఏర్పాట్లు
పార్టీ నేతల్లో జోష్ నింపేలా చంద్రబాబు పర్యటన
భారీగా ఏర్పాట్లు చేసిన టిడిపి నేతలు
చంద్రబాబు రాకతో యువతలో ఆసక్తి
విశాఖపట్నం,ఏప్రిల్ 4 (ఆంధ్రపత్రిక): నాలుగు ఎమ్మెల్సీల గెలుపుతో టిడిపిలో జోష్ నిండిరది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమాలో పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే లోకేశ్ పాదయాత్రలో ఉండగా టిడిపి అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. రానున్న రోజుల్లో టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న భరోసాలో పార్టీ నేతలు ఉన్నారు. చంద్రబాబు కూడా ఇక విజయం తమదే అన్న ధీమాలో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు విశాఖ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు బాబు విశాఖ పర్యటనకు వస్తున్నారు. విశాఖ రాజధానిగా జగన్ హడావిడి చేస్తున్న తరుణంలో బాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడిరది. తెలుగుదేశం ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు నిర్వహణకు జిల్లా పార్టీ నాయకులు ఐదు కమిటీలు ఏర్పాటుచేశారు. ఇందుకు సంబంధించి కార్యక్రమం ఖరారయ్యింది. ఈనెల ఐదో తేదీన నగరంలోని పోతినమల్లయ్యపాలెంలో గల ’వి కన్వెన్షన్’ సెంటర్‌లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న సదస్సులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదు వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున…అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేసారు. ఇందుకోసం ఆహ్వానం, అలంకరణ, ఫుడ్, ఆర్గనైజేషన్, వలంటీర్ల కమిటీలు ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టు నుంచి పీఎంపాలెంలో వి.కన్వెన్షన్ సెంటర్ వరకు జాతీయ రహదారి పొడవునా పార్టీ జెండాల అలంకరణ బాధ్యతను కార్పొరేటర్ల సాయంతో డెకరేషన్ కమిటీ చేపట్టనున్నది. సదస్సుకు వచ్చే నాయకులు, ఇన్‌చార్జులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులకు భోజనం అందించే బాధ్యతను ఆహార కమిటీ తీసుకోనున్నది. ఈ సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా చర్చించారు. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న, విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ ఇన్‌చార్జి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ మూర్తి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగదీశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్, బత్తుల తాతయ్యబాబు, కోళ్ల లలితకుమారి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. మినీమహానాడు తరహాలో సదస్సు ఏర్పాటు చేశారు. అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని రానున్న ఎన్నికల్లో సాగనంపాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా చేయడంతో పాటు రాష్టాన్న్రి అప్పుల పాలుచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి, గృహ నిర్మాణ, పంచాయతీ నిధులతో రాష్ట్రంలో పథకాలు, జగన్న కాలనీ, భవనాలకు రంగులు వేసుకుంటూ సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది.. అన్నచందాన జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం, ఇసుక అమ్మకాల్లో అవినీతికి పాల్పడడమే కాకుండా మద్యపాన నిషేధం అంటూ మహిళలకు ఎన్నికల్లో హావిూ ఇచ్చి తుంగలోకి తొక్కారన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెపుతున్న సీఎం, చాలాచోట్ల చెరువుల్లో, గోతుల్లో స్థలాలు ఇవ్వడంతో వాటిని మాకొద్దు అంటూ ప్రజలు తిరిగి రద్దు చేయించుకుంటున్న విషయాన్ని గ్రహించాలని అయ్యన్న సూచించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.