ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీని గద్దె దించడమే లక్ష్యం అంటున్న టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి.. పొత్తు ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో రెండు పార్టీల ఓటు బ్యాంకు సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. దసరా రోజున రాజమండ్రిలో పవన్ కళ్యాణ్-నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ముందుకు సాగడంపై ఎక్కువగా చర్చించారు ఇరు పార్టీల నేతలు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీని గద్దె దించడమే లక్ష్యం అంటున్న టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి.. పొత్తు ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో రెండు పార్టీల ఓటు బ్యాంకు సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. దసరా రోజున రాజమండ్రిలో పవన్ కళ్యాణ్-నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ముందుకు సాగడంపై ఎక్కువగా చర్చించారు ఇరు పార్టీల నేతలు. ఇక జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకూ సమన్వయ కమిటీల ద్వారా రెండు పార్టీల కేడర్ ను ఒకే తాటిపైకి తీసుకొచ్చేలా చర్యలు మొదలు పెట్టారు. అంతిమంగా ఓట్ల బదలాయింపుపైనే ఎక్కువగా దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారు. ఇప్పటికేరెండు పార్టీల నుంచి ఎన్నికల్లో సీట్లు ఆశించిన నేతలున్నారు. పొత్తులో భాగంగా ఎవరైనా సీట్లు కోల్పోతే వారికి వేరే పదవులు వస్తాయని ఇప్పటి నుంచే బుజ్జగించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ముందుగా రెండు పార్టీల మధ్య బంధం బలపడితే ఆ తర్వాత ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తే విజయవంతం అవుతాయనేది రెండు పార్టీల అభిప్రాయంగా తెలుస్తుంది. ఇక నవంబర్ ఒకటో తేదీన ఉమ్మడి మినీ మేనిఫెస్టో.. నవంబర్ మూడున రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినా.. ఈ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఉమ్మడి మేనిఫెస్టో నవంబర్ ఒకటిన ప్రకటిస్తామని స్వయంగా నారా లోకేష్ రాజమండ్రిలో ప్రకటించారు. అయితే, పలు కారణాలతో రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డట్లు తెలిసింది.
కారణం ఇదే అంటున్న రెండు పార్టీలు..
నవంబర్ ఒకటో తేదీన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్-నారా లోకేష్ ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మేనిఫెస్టోపై అధికారిక ప్రకటన చేశారు. చంద్రబాబు బెయిల్ పై బయటికి రాకముందే మేనిఫెస్టో విడుదల వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజమండ్రిలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమావేశంలోనే మేనిఫెస్టోపై చర్చ జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ లో కీలక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి తోడు మరో నాలుగు ప్రతిపాదనలు జనసేన తరపున ఇచ్చారు. టీడీపీ సూపర్ సిక్స్‌లో మహిళల కోసం మహా శక్తి పథకం పొందుపరిచారు. రైతుల కోసం అన్నదాత,నిరుద్యోగుల కోసం యువ గళం, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ పథకాలకు అంగీకరించిన జనసేన కూడా తమ పార్టీ ప్రధానంగా గుర్తించిన సమస్యలు, హామీలను మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం పైనా మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. జనసేన ప్రతిపాదనలపై ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అయితే రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలి అనుకున్నప్పటికీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉండటం, మేనిఫెస్టోలో పెట్టె అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండటంతో వాయిదా పడినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మరోసారి చర్చించి అప్పుడే మేనిఫెస్టో విడుదల తేదీని ప్రకటిస్తారని చెప్తున్నారు. ఆ తర్వాతే రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు ముగియడంతో రెండు పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నవంబర్ మూడో తేదీన జరపాలని ముందుగా నిర్ణయించారు. మేనిఫెస్టో విడుదల వాయిదాతో ఈ సమావేశం కూడా వాయిదా పడింది. ప్రస్తుతం చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంతో నారా లోకేష్ కూడా కొంచెం బిజీగానే ఉన్నారు. ఈ కారణాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరింత ఉత్సాహంలో కేడర్..
తెలుగుదేశం పార్టీ-జనసేన ఉమ్మడి సమావేశాలు జిల్లా స్థాయిలో కూడా ముగియడంతో రెండు పార్టీల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది. రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో కలిసి వెళ్లేలా సమన్వయ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలై విజయవాడకు వెళ్లే మార్గంలో కూడా టీడీపీ కేడర్ తో పాటు జనసేన కేడర్ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్డు మీదకు వచ్చింది. ఆయా జిల్లాల్లో రెండు పార్టీల జెండాలతో నాయకులు కలిసి ముందుకెళ్లారు. ఇక చంద్రబాబు కూడా మార్గమధ్యలో జనసేన ముఖ్య నేతలతో ప్రత్యేకంగా మాట్లాడటం కూడా రెండు పార్టీలను మరింత దగ్గరకు చేసిందన్న చర్చ జరుగుతుంది.