తెలుగుదేశం-జనసేన పార్టీల మినీ మేనిఫెస్టో దాదాపు ఖరారైంది. మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన అంశాలపై రెండు పార్టీల అధినేతలు ఇవాళ ఆమోదముద్ర వేయనున్నారు. నవంబర్ 17 నుంచి 11 అంశాలతో ఉమ్మడిగా ఇంటింటికీ వెళ్లనున్నాయి రెండు పార్టీలు. మరోవైపు నవంబర్ 18 వ తేదీ నుంచి ఉమ్మడి పోరాటాలకు సిద్ధమవుతున్నాయి రెండు పార్టీలు.
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పై దాదాపు స్పష్టత వచ్చింది. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలు రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆమోదం కోసం పంపించారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలపై సూచనాప్రాయంగా అంగీకారం లభించింది. ఇవాళ అధికారికంగా ఆమోద ముద్ర పడనుంది. నవంబర్ 13వ తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ, రెండు పార్టీల నుంచి ఆరేసి అంశాలు ప్రతిపాదించింది. ఇప్పటికే రాజమండ్రి మహానాడులో టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో హామీలు ప్రకటించింది. మహిళల కోసం మహా శక్తిలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సాయం, ఆడబిడ్డ నిధి నుంచి 18ఏళ్ళు నిండిన ప్రతిమహిళకూ నెలకు రూ. 1,500, దీపం పథకం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
రైతుల కోసం అన్నదాత పథకం కింద ప్రతి ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం, ఆక్వా, ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారు. యువత కోసం యువ గళం కింద నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి మంచినీరు, పూర్ టు రిచ్ వంటి అంశాలతో మేనిఫెస్టో ప్రకటించింది. ఈ హామీలకు తోడు జనసేన కూడా మరో 6 ప్రతిపాదనలు తీసుకొచ్చింది. వీటిలో రైతులకు సంబంధించి కౌలు రైతులకు ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయంను ఉమ్మడి అంశంగా చేర్చారు. మరో ఐదు అంశాలను కొత్తగా చేర్చారు.
టీడీపీ ఆరు-జనసేన ఐదు అంశాలతో మేనిఫెస్టో
జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాల్లో సౌభాగ్య పథం కింద కొత్తగా పరిశ్రమలు స్థాపించే యువతకు 20 శాతం లేదా గరిష్టంగా రూ. 10 లక్షల వరకూ ఆర్థిక సాయం, ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని మరో ప్రతిపాదన. ఇక ఏపీకి అమరావతి ఒకటే రాజధాని, సంపన్న ఆంద్రప్రదేశ్ కింద ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడం,కార్మికుల సంక్షేమం,వలసల నిరోధం,కనీస వేతనాలు పెంపు వంటి అంశాలను చేర్చారు. ఈ 11 అంశాలతో మినీ మేనిఫెస్టో దాదాపు ఖరారు అయింది. రేపటి నుంచి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు ఇరు పార్టీల నేతలు.
ఇప్పటికే భవిష్యత్తు కు గ్యారంటీ పేరుతో టీడీపీ ప్రకటించిన హామీలను ఆ పార్టీ నాయకులు ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. ఇకపై చంద్రబాబు-పవన్ ఫోటోలు ముద్రించిన మేనిఫెస్టో తో రెండు పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. మరోవైపు నవంబర్ 18,19 తేదీల్లో రోడ్ల సమస్యపై ఉమ్మడిగా పోరాటానికి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేల మీద ఛార్జిషీట్లు కూడా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఒక పక్క మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మరోవైపు ప్రభుత్వంపై ఆందోళలను చేస్తూ దూకుడుగా ముందుకెళ్లేలా రెండు పార్టీలు కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం.