మచిలీపట్నం నవంబర్ 20 ఆంధ్రపత్రిక :
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు లెక్క చేయకుండా, అమలు చేయని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని
మచిలీపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు, లంకిశెట్టి బాలాజీ , తదితరులు జిల్లా కలెక్టర్ కి సోమవారం స్పందన లో వినతి పత్రం అందించారు.
గత రెండు సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ అయిన జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు అమలు చేయని మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్, మున్సిపల్ కౌన్సిల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ కు సోమవారం స్పందన కార్యక్రమంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ సాధన కమిటీ తరఫున ప్రముఖ న్యాయవాది లంకి శెట్టి బాలాజీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘా లతో కలిసి జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు కి వినతి పత్రం అందజేసారు. అనంతరం న్యాయవాది లంకి శెట్టి బాలాజీ మీడియాతో మాట్లాడుతూ
మచిలీపట్నంలో యూనియన్ బ్యాంకు వారు కేటాయించిన 40 కోట్ల రూపాయలతో స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాల శౌరి లెటర్ పై , స్వదస్తూరితో స్థలం కేటాయించి ఆ స్థలమునకు ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్, కౌన్సిల్ పాలకవర్గం స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి ని విస్మరించడం భావ్యమా? అని ప్రశ్నించారు.
మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రాబ్యాంక్ స్థాపించి కుల ,మతాలకు అతీతంగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తి పేరును విస్మరిస్తూ గత రెండు సంవత్సరాల నుండి సదరు అంశాన్ని కౌన్సిల్ అజెండాలో పెట్టకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ ఎదుట మచిలీపట్నం ఎంపీ పట్టాభి స్మారక భవనం అంశంపై జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో వివరణ కోరినా కూడా మచిలీపట్నం మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్టు ఎంత మాత్రం పట్టించుకోవడంలేదన్నారు.
అలాగే బిల్డింగు సాధన కమిటీ సభ్యులు కౌన్సిల్ ఏజెండాలో పెట్టమని పలుమార్లు మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ ను, మేయర్ ను కలిసినా పట్టాభి స్మారక భవనం విషయాన్ని కమిషనర్, పాలకవర్గం వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ గత రెండు సంవత్సరాల నుండి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయని, మచిలీపట్నం మున్సిపల్ నగరపాలక సంస్థ కమీషనర్ ను ప్రభుత్వానికి సరెండర్ చేసి, నగరపాలక సంస్థ కౌన్సిల్ వారు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయనందుకు కౌన్సిల్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ కు ప్రజల మనోభావాలను తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.
ఈనెల 24వ తేదీ న స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి రోజునే ఆయనను అవమానిస్తూ పాలకులు
పట్టాభి స్మారక భవనం విషయాన్ని కౌన్సిల్ ఎజెండాలో పెట్టకుండా మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం ఎంతవరకు సబబు? అని దుయ్యబట్టారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని పాలకులకు పుట్టగతులు ఉండవు అన్నారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికారులు గ్రహించాలని వెంటనే పట్టాభి స్మారక భవనం నిర్మాణ అంశాన్ని ఈనెల 24న జరిగే కౌన్సిల్ ఎజెండాలో, టేబుల్ ఎజెండాగా పెట్టీ నగరపాలక సంస్థ అనుమతులు ఇచ్చి వెంటనే పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
సదరు పట్టాభి స్మారక భవనం అంశంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. పాలకులు అభివృద్ధికి సహకరించకుండా యూనియన్ బ్యాంక్ వారిచ్చే 40 కోట్ల రూపాయల నిధులను మురిగి పోయేటట్లు చేయటం సబబు కాదన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టాభి మెమోరియల్ బిల్డింగ్ సాధన కమిటీ సభ్యులు, వేమూరి రామకృష్ణారావు, ఏ ఆర్ కే మూర్తి, పి. వి. ఫణి కుమార్, ప్రముఖ న్యాయవాది, పుప్పాల ప్రసాద్, వి ఎస్ ఎస్ ఆర్ శర్మ, మోపర్తి సుబ్రమణ్యం, జనసేన మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి, బండి రామకృష్ణ, జనసేన నాయకులు, గడ్డం రాజు, వంపుగడల చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, ఎండి ఇలియాస్ పాషా, పిప్పళ్ళ వెంకట కాంతారావు, టిడిపి మహిళా నాయకురాలు, లంకి శెట్టి నీరజ తదితరులతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.