అమరావతి పిటిషన్లను మరో ధర్మాసనానికి బదిలీ చేయండి
న్యూఢల్లీి, నవంబర్ 1 (ఆంధ్రపత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, ఏపీ సర్కారు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే, పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి విముఖత వ్యక్తం చేశారు. రాజధాని పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుమారు 2వేల పేజీలతో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, హైకోర్టు ఆదేశాల ప్రకారం.. సీఆర్‌డీఏ ఒప్పందం అమలు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. రైతులు తమ పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశాలపై స్పష్టత లేదని, తీర్పులో ప్రస్తావించిన అంశాలతో పాటు తాము లేవనెత్తిన విషయాలు పొందుపరిచేలా చూడాలని చూడాలని సుప్రీంకోర్టును కోరారు.