మచిలీపట్నం నవంబర్ 9 ఆంధ్ర పత్రిక.:
కొన్ని ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు నానాటికి తీసి కట్టు..! అన్నట్టుగా విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని, తల్లిదండ్రులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు దండుకుంటూ విద్యార్థులను బాల కార్మికుల్లాగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వాడుకుంటున్నాయి, అని ఆవేదన చెందుతున్నారు.
తాజాగా నగరంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో క్రీడా పరికరాలు, బరువైన వస్తువులు మొయించడం బాధాకరం. ఇలా బరువైన వస్తువులు మోయించడం విడ్డూరంగా ఉంది. బల్లలు గాని కుర్చీలు గాని ,బరువైన వస్తువులు కానీ పిల్లల కాళ్ళ మీదో, చేతుల మీదో పడి గాయాలు అయితే ఎవరు బాధ్యులు?కూలీ ఖర్చులు కలిసొస్తాయని పిల్లల్ని ఇలా బాల కార్మికులలా వాడుకోవడం సబబేనా? లేక పాఠశాలలో పిల్లలతో వెట్టి చాకిరి చేయించడం ఆనవాయితీనా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.పాఠశాలలో ఆయాలు ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పీఈటీలు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబేనా? అని అనుకోవడం గమనార్హం.
సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో బాల్యం బరువైన వస్తువులు మోయడంలో కూరుకుపోయింది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? బరువైన వస్తువులే కాదు, బాలలచే ఏ విధమైన వెట్టిచాకిరి చేయించకూడదు. సిబ్బందికి కనీస అవగాహన కూడా లోపించడం విడ్డూరం గా ఉంది. మోయడానికి సిబ్బంది లేరా? ఇదేం పని అని ప్రశ్నిస్తున్నారు.
అంతే గాక విద్యార్థులను సాయంకాలం పూట క్రీడామైదానాల్లో బ్యాడ్మింటన్ కోర్టుకు సున్నాలు చల్లించడం లాంటి చిల్లర పనులు కూడా చేయిస్తున్నారు. దీనివల్ల బాల్యంలోనే పిల్లలకు శ్వాస కోశ వ్యాధులు సోకితే బాధ్యులు ఎవరు? ఈ విషయంలో కనీస అవగాహన కూడా సిబ్బందికి లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం. దీనివల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మాస్టారు ఎక్కడ కొడతారో? అనే భయం వల్ల పిల్లలు బలవంతంగా అయిష్టం గా పనులు చేయడం బాధాకరం. బాల్యంలో పిల్లల చేత బాల కార్మికుల్లాగా పనులు చేయించడం భావ్యమేనా?తరగతి గదుల్లో బల్లలు మోయించడం, బరువైన పనులు చేయడం, కొన్ని పాఠశాలల్లో అయితే పిల్లల చేత తరగతి గదులు శుభ్రం చేయించడం కూడా లోపాయికారిగా జరుగుతోంది. పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడిందని చెప్పవచ్చు.
చిట్టి చేతులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలకు వెళితే పనులు ఎక్కడ చేయవలసి వస్తుందో అని కొంతమంది పిల్లలు భయపడి గైరు హాజరు అయ్యే ప్రమాదం కూడా ఉంది.
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థి పాఠశాలలో విద్యకు మాత్రమే పరిమితం కావాలి. సాయంకాలం పూట విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు, ఆటలు దోహదపడతాయి. నగరంలో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో క్రీడా మైదానాలు కూడా లేవు. బహుళ అంతస్తుల భవనాల్లో సరైన గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఇరుకు గదుల్లో సైతం విద్యాబోధన కొనసాగుతోంది. విద్యార్థులు మర యంత్రాల్లా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎక్కువ ప్రైవేట్పఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కూడా కరువయ్యాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నా కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం సబబేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలపర్చండి..,!
జగనన్న ప్రభుత్వం నాడు- నేడు ద్వారా విద్యా సంకల్ప యజ్ఞం ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాక , ఇంగ్లీష్ మీడియం ని కూడా ప్రవేశపెట్టింది. కానీ చాలామంది తల్లిదండ్రులలో ప్రభుత్వ పాఠశాల అంటే ఇప్పటికీ చిన్న చూపు గానే ఉంది. వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలల్లో చేరుస్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలల లక్ష్యాలను, ఆశయాలను నెరవేర్చడంలో కొంతమంది తల్లిదండ్రులు వెనకంజ వేస్తున్నారు. దూరపు కొండలు నునుపు, అనే సామెతను తీసుకుని ఇలా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చడం వల్ల బాల్యం,బరువు అనే బందిఖానాలో చిక్కుకుపోతుంది. తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ఆలోచిస్తే ఇలాంటి దుస్థితి దాపురించదు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉన్నత విద్య, డిగ్రీలు చదివిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో కేవలం డిగ్రీ అర్హతతోనే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. పాఠశాలలను బలోపేతం చేయాలి అంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. అప్పుడే నూతన శకానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాలలచే బరువైన పనులు చేయించకుండా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం..!