మచిలీపట్నం అక్టోబర్ 9 ఆంధ్ర పత్రిక.:
జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా నిరోధించేందుకు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం నగరంలోని స్పందన సమావేశం మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నివారణపై జిల్లాస్థాయి కన్వర్జేన్స్ సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు.బాల్య వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని తెలియజేసే గోడపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించేందు కోసం ప్రభుత్వం తాజాగా జీవో నంబర్ 31, 39 లలో మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు.బాల్య వివాహాలను చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు స్థాయి నుండి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులందరూ బాల్య వివాహాల నిరోధించేందు కోసం తమ వంతు కృషి చేయాలన్నారు.గ్రామాల్లో కొన్ని బాల్య వివాహాలు ప్రభుత్వం దృష్టికి రాకుండానే జరిగిపోతున్నాయన్నారు.
ముఖ్యంగా చదువుకోని తల్లిదండ్రులు, పేదలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు బాల్య వివాహాల పట్ల మొగ్గుచూపుతున్నారన్నారు.
ఈ పరిస్థితులను నివారించేందుకు డి ఆర్ డి ఏ ఏపీఎంలు, డీపీఎంలు, ఆనిమేటర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు బాధ్యత తీసుకొని స్వయం సహాయక మహిళ సంఘాల సభ్యులందరికీ బాల్య వివాహాల వలన కలిగే అనర్థాల పట్ల అవగాహన కలిగించాలన్నారు.
పాఠశాల విద్యార్థినులకు కూడా ఈ విషయమై అవగాహన కలిగించాలన్నారు.
విద్యార్థినుల తల్లిదండ్రులు వారికి వివాహం చేస్తారనే విషయం తెలియగానే సంబంధిత ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. తద్వారా ఆ బాల్యవివాహాన్ని నిరోధించేందుకు వీలు కలుగుతుందన్నారు.
స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో కూడా బాల్యవివాహాల నిరోధంపై చర్చించాలన్నారు.
గ్రామ వార్డు స్థాయిల్లో సంబంధిత సచివాలయాల మహిళా పోలీసులు, పరిపాలన కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, మండల విద్యాశాఖాధికారులు బాధ్యత తీసుకొని బాల్య వివాహాలను నిరోధించేందుకు కృషి చేయాలన్నారు.
నెలకు ఒకసారి జరిగే గ్రామసభల్లో కూడా బాల్య వివాహాల నిరోధించుట పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పాఠశాలలలో ఉపాద్యాయులు , గ్రామ సభలలో సంబంధిత ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యకర్తలు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించాలన్నారు.
బిడ్డ పుట్టినప్పుడు కనీసం మూడు కిలోల బరువు ఉండాలని అలా కాకుండా బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా అటువంటి పిల్లల్లో సరైన ఎదుగుదల కూడా ఉండదని తెలిపారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, ఐసిడిఎస్ పిడి సువర్ణ ఆర్ డి ఓ శివ నారాయణ రెడ్డి, జడ్పీ సీఈవో జ్యోతిబసు, డిఆర్డిఎ డ్వామా పీడీలు పీఎస్ఆర్ ప్రసాదు సూర్యనారాయణ, డిఎస్ఓ పార్వతి ముడా విసి రాజ్యలక్ష్మి, డిఇఓ తహేరా సుల్తానా తదితరజిల్లా అధికారులు పాల్గొన్నారు.