పరమ భాగవతోత్తముడు, పదకవితా పితామహుడు అన్నమయ్య గురించి తెలుగువారికి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.నిత్యస్మరణీయుడైన ఆ మహ నీయుని ఆరాధనా దినోత్సవం ఇంగ్లీష్ లెక్కల ప్రకారం ఫిబ్రవరి-23-1503. మరికొన్ని రోజుల్లోనే ఆ శుభసంరంభం. మహాత్ముడైన అన్నమయ్య భౌతికంగా శరీరాన్ని వీడి ఐదు వందల సంవత్సరాలు దాటిపోయింది.తెలుగు పంచాంగం ప్రకారం దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ ద్వాదశినాడు ఈ కవీశ్వరుడు వేంకటేశ్వరుడులో ఐక్యమై పోయాడు.మే 9వ తేదీ 1408లో జన్మించాడు.కడప ప్రాంతంలోని రాజంపేట దగ్గర ‘తాళ్లపాక’ వీరి ఊరు,ఇంటిపేరు కూడా అదే.95 ఏళ్ళపాటు పరిపూర్ణమైన,సంపూర్ణమైన జీవితాన్ని గడిపాడు. సమ కాలీన జీవితంలోనూ, ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఒక వెలుగు వెలిగాడు. ఉత్తర భారతంలోని సూరదాసు, నందదాసు కంటే దాదాపు వందేళ్ల ముందే భక్తి సంగీతాన్ని ప్రచారం చేసిన భక్తాగ్రేసరుడు.ఈయన ప్రభావం తెలుగుదేశంలోనే కాక, దక్షిణాది మొత్తం విస్తరించింది. ఇంతటి మహనీయుడిని కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు లోకం మర్చిపోయింది.వేటూరి ప్రభాకరశాస్త్రి కృషితో ఆ ప్రభ మళ్ళీ పైకి వచ్చింది. నేలమాళిగలలో రాగిరేకుల్లో దాగి వున్న అన్నమయ్య అద్భుత సారస్వతాన్ని బయటకు తీసి,పరిష్కరించి ప్రపంచానికి అందేలా చేసిన మహనీ యుడు వేటూరి ప్రభాకరశాస్త్రి.ఆయన లేకపోతే, ఆ కృషి జరుగకపోతే అన్నమ య్యను లోకం మరి కొన్నాళ్ళు మర్చిపోయి ఉండేది.అన్నమయ్య సంకీర్తనా ప్రచార యజ్ఞంలో మొట్టమొదటగా స్మరించి,అంజలి ఘటించాల్సిన వ్యక్తి వేటూరి ప్రభాక రశాస్త్రి.స్మరణీయులలో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ద్వితీయులు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి స్థానం విశిష్టం.ఆ సంకీర్తనలను తొలిగా స్వరపరిచి జాతికి సమర్పించింది రాళ్లపల్లివారు.గౌరిపెద్ది రామసుబ్బశర్మ,మంగళంపల్లి,మల్లిక్,నేదునూరి కృష్ణమూర్తి మొదలైన వారు చేసిన సేవ సామాన్యమైనది కాదు. ఈ వరుసలో గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ వంటివారిని కూడా చేర్చాలి.శోభారాజును తలచుకొని తీరాలి.’ అన్నమయ్య ప్రాజెక్టు’ రూపకల్పనలో మూలస్థంభం చెలికాని అన్నారావు.టీటీడీలో అధికారిగా,ఛైర్మన్ గా ఆయన అందించిన సేవలన్నీ ఒక ఎత్తు -అన్నమయ్య ప్రచారం ఇంకా ఎత్తు.ఇందరు మహనీయుల సేవా విశేషంగా మనకు దొరికిన ఈ అపూర్వ సంపదను సద్వినియోగం చేసుకోవడంలో ఇంకా బలంగా ముందుకు సాగాల్సి ఉంది.అన్నమయ్య 32వేల కీర్తనలను రచించినట్లు చరిత్ర చెబుతోంది. అందులో ఇంతవరకూ సుమారు 12 వేలకు పైగా కీర్తనలు దొరికినట్లుగా చెబుతున్నారు. వేటూరి ప్రభాకరశాస్త్రి తనయుడు ఆచార్య ఆనందమూర్తి కూడా అన్నమయ్య ప్రచార యజ్ఞంలో పునీతులవుతున్నారు.ఆయన కూడా కొన్ని కీర్తనలను సేకరించి లోకానికి అందించారు. ఆనందమూర్తి సేవలను కూడా మనం సంపూర్ణం గా సద్వినియోగం చేసుకోలేకపోయాం.ప్రస్తుతం వారు వృద్ధులై ఉన్నప్పటికీ, ఇంకా అన్నమయ్య కీర్తనలను సేకరించడం,లోకానికి అందించడంలో అలుపెరుగని సేవ చేస్తున్నారు.అన్నమయ్య తెలుగువాడి అక్షరసంపద, సంగీత సర్వస్వం.ఎన్నెన్నో పాటలు, పదాలు,కీర్తనలు ఆ కంఠం నుంచి ఆ గంటం నుంచి వెలువడ్డాయి.అవన్నీ అత్యంత విలువైనవి.గీత రచన -స్వరరచన ఏకకాలంలో నిర్వహించిన వాగ్గేయకార ప్రసిద్ధులలో అన్నమయ్యది విభిన్నమైన మార్గం. సంస్కృతభూయిష్టమైన పదాల పోహళింపు ఎంత ఉంటుందో.. అచ్చతెలుగుపదాల పరిమళం అంతే ఉంటు ంది.ఆనాటి రాయలసీమ,ముఖ్యంగా కడప జిల్లా మాండలిక పదాలే కాక, అప్పటి తెలుగు పదసంపద మొత్తం అన్నమయ్య పదాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. జనంభాష అంత విరివిగా రాసిన కవీశ్వరులు చాలా చాలా అరుదు.సకల వేదాల సారాన్ని,సర్వ మానవ సాగరాన్ని మధించి కీర్తనల రూపంలో అందించిన తత్త్వవేత్త.వేంకటేశ్వరుడిని స్తుతిస్తూ కనిపిస్తూనే జీవిత తత్త్వం మొత్తాన్ని మానవాళికి బోధించాడు. వైభవం -వైరాగ్యం రెండిరటినీ అనుభవించినవాడు కాబట్టే అలతి అలతి పదాలలో అన్ని మర్మాలను అంత అందంగా,సులభంగా చెప్పాడు.కేవలం మానవాళియే కాదు,సర్వజీవుల పట్ల సమభావనతో జీవించాడు, జీవించమని చెప్పాడు.భక్తి రూపంలో మనిషికి గొప్ప శక్తిని అందించాడు.త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య వంటి వాగ్గేయకార మహనీయులందరికీ గొప్ప ప్రేరణగా నిలిచాడు,వారి సంకీర్తనా ప్రస్థానానికి బంగారుబాటలు వేసిపెట్టాడు.పక్షిలో,జంతువులో,ప్రకృతిలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయని చాటి చెప్పాడు.అన్నమయ్య కీర్తన వింటే చాలు జ్ఞానం దర్శనమవుతుంది, జీవన మార్గం కనిపిస్తుంది. చందమామ రావె.. జాబిల్లి రావె.. అనే పాట తెలుగునాట బహుప్రసిద్ధం. అయితే,అది అన్నమయ్య రాశాడని చాలా తక్కువమందికి తెలుసు. ఇటువంటి జానపదాలు రాశాడు కాబట్టే జనపదాల్లో ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు.’ బ్రహ్మమొక్కటె -పరబ్రహ్మమొక్కటె’ ఈ ఒక్క కీర్తన చాలు అన్నమయ్య సమతా మమతను చాటిచెప్పడానికి. ‘‘ నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె… అంటనే బంటు నిద్ర అదియు నొకటె… కడగి ఏనుగు మీద కాయు ఎండొకటె… పుడమి శునకము మీద పొలయు ఎండొకటె ‘‘ఈ మాటలు చాలు అన్నమయ్య హృదయం ఏమిటో చెప్పేందుకు.‘‘ఒకపరి కొకపరి వయ్యారమై..’’ అని ఆయనే అన్నట్లు ఒక్కొక్కమారు ఒక్కొక్క తీరులో పదకవితలు తెలుగులోకానికి అందించిన అన్నమ య్య అవతారపురుషుడు.తన సర్వ సారస్వతాన్ని, కవితాప్రతిభను దైవానికి,ఆ రూపంలో లోకానికి వెచ్చించాడు తప్ప,వ్యక్తిగత స్వార్ధాలకు, కీర్తి,కాంత,కనకాలకు తాకట్టు పెట్టలేదు.’’హరిని కీర్తించే నోటతో నరుని కీర్తించను’’ అని చెప్పిన ఆత్మాభిమాన ధనుడు.‘‘బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి.. అప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ హాలికులైన నేమి?’’ అన్నాడు పోతన్న కూడా.అన్నమయ్య గీతాలు ఏ రాగానికైనా,ఏ తాళానికైనా, ఏ బాణీకైనా ఒదిగిపోతాయి. జానపదంగా,లలితగీతంగా, భక్తి సంగీతంగా,శాస్త్రీయ కీర్తనగా పాడుకోవచ్చు,ఆడుకోవచ్చు.అంతటి ఒదుగు ఎదుగు ఉన్న కవితాశిల్పం అన్నమయ్యది.యశఃకాయుడైన అన్నమయ్య జననమరణాలకు అతీతుడు.అంతట తానై అగుపించే అనంతుడు.దొరికిన సారస్వతం లోని పదాల విశేషాలు,అర్ధాలు, అంతరార్ధాలు,పరమార్ధాలు,సంగీత సాహిత్య మర్మాలు సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా రాయించి ప్రచారం చెయ్యాలి. అధ్యయనాలు,పరిశోధనలు పెద్దఎత్తు న జరగాలి.ఈ బృహత్ బాధ్యతను టీటిడి సంపూర్ణంగా,సమగ్రంగా స్వీకరించాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!