మచిలీపట్నం సెప్టెంబర్ 13 ఆంధ్రపత్రిక:
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య.. అంటూ హిందువులు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఇటీవల కరోనా వల్ల గత మూడు సంవత్సరాలుగా భక్తులు తమ ఇళ్ల వద్దనే వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. వినాయక చవితి వేడుకలు అంటే నవరాత్రులు అత్యంత వైభవంగా జరిపి తదుపరి నిమజ్జన అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తారు. మచిలీపట్నం పరిసర ప్రాంత గ్రామాలు పట్టణాలకు కావలసిన గణేష్ విగ్రహాలను స్థానిక వలందపాలెం, మాచవరం ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కళాకారులు విగ్రహాలు అందంగా ఆకర్షణీయంగా తయారు చేసి భక్తులకు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కరోనా వల్ల మూడు సంవత్సరాలు ఏ విధమైన వ్యాపారం, లేక కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం విగ్రహాల తయారీకి కావాల్సిన కొబ్బరి పీచు, బంకమట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు మొదలైనవి రేట్లు అత్యధికంగా పెరగటం వల్ల విగ్రహాల తయారీ చాలా కష్టంతో కూడుకున్న పనిలా తయారయ్యింది, అని విగ్రహాలు తయారుచేసే కళాకారులు ఆవేదన చెందుతున్నారు. కళాకారులకు తగిన గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు, స్థలాభావం ఇవన్నీ అదనపు ఒడిదొడుకులు గా భావించాలి. తాతల కాలం నుండి నేటి తరం వరకు ఈ విగ్రహాల తయారీలోని మెళకువలు తెలుసుకొని , ఎప్పటికప్పుడు ఆధునిక హంగులతో విగ్రహాలు తయారు చేసి భక్తులకు అందజేసి వారిచ్చే డబ్బుతోనే జీవనోపాధి గడపడం కళాకారులకు చాలా కష్టంగా ఉందని విగ్రహాల తయారీ కళాకారుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు. ముడి సరుకులు రేట్లు భారీగా పెరిగిపోవడం వలన, విగ్రహాలు తయారీకి చాలా సమయం పట్టడం వల్ల కూడా వారికి కనీస కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని ఆయా కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. వారికి మరి ఏ ఇతర పని చేతకాక, ఈ పని మీదే ఆధారపడుతూ, భక్తుల కోరికలు తీర్చుతూ వారికి కావలసిన మోడల్స్ లో బొమ్మలు తయారుచేసి ఇవ్వటం చేస్తున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాడవాడలా ఈ విగ్రహాలను భక్తులు ఆధునిక హంగులతో అలంకరిస్తారు. ఈ విగ్రహాల తయారీ వల్ల తమకు ఎంతో ఆనందం, సంతృప్తి , కలుగుతాయని కళాకారులు తెలిపారు. ఇటీవల మట్టితో తయారు చేసిన గణనాధుల ప్రతిమలకు డిమాండ్ పెరగడంతో, వాటిని కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలు వాడాలని సూచిస్తోంది ప్రభుత్వం . ఆ మేరకు మట్టి గణనాథుల విగ్రహాలను కూడా అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. తాము ఎంతో భక్తి భావంతో నియమ నిష్ఠలతో విగ్రహాలు తయారు చేస్తామని ఆ సమయంలో మద్య మాంసములు ముట్టమని వెంకట్రావు అనే కళాకారుడు తెలిపారు. తాము ఆర్థికంగా చాలా బాధలు ఎదుర్కొంటున్నామని కాబట్టి ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి ఆర్థికంగా రుణాలు మంజూరు చేసి ఆదుకుంటే తమ జీవన స్థితిగతులు మారతాయని కళాకారులు భావిస్తున్నారు. విగ్రహాలు తయారు చేయడంలో కళా నైపుణ్యం ఉన్న ఇలాంటి కళాకారులను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వారి జీవన భృతికి, ఆదాయ వనరులు పెంచుకునేలాగా సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు, అందించి ఆదుకుంటుందని కళాకారులు ఆశిస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరాలని కోరుకుందాం..!