న్యూ ఇయర్‌లోనే సెట్స్‌పైకి చిత్రాలు
డిసెంబర్ 24 (ఆంధ్రపత్రిక): స్టార్ హీరోల సినిమాలన్నీ విరామంలో ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కానీ షూటింగ్ జరుపుకునేలా లేవు. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ఎంబీ 28వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ ప్రారంభమైనా..మహేష్ సెట్స్‌కి వెళ్లడం లేదు. ఇటీవల కాలంలో ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న కారణాలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారం నుంచి సెట్స్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అటుపై పండుగ తర్వాత ఏకంగా 60 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. అప్పటి నుంచి మహేష్ నిరవధికంగా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అలాగే ఎన్టీఆర్ 30వ చిత్రం కూడా పండగ తర్వాతనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ చిత్రీకరణకి సంబంధించి సర్వం సిద్దం చేసి రెడీగా ఉన్నారు. అందుకే తారక్ బిజీ అవ్వడానికి ముందే ఫ్యామిలీతో లండన్ కి వెకేషన్ కి వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకలు కూడా అక్కడే జరపుకుని ఇండియాకి రానున్నారు. అటుపై సంక్రాంతి పండగలో బిజీ అవుతారు. అనంతరం యాక్షన్ లోకి దిగిపోతారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప `2 షూటింగ్ కి పొంగల తర్వాత జాయిన్ అవుతారు. ఆయనకు అత్తగారింట్లో సంక్రాంతి జరుపుకోవడం అలవాటు. కుటుంబంతో కలిసి స్నేహారెడ్డి పుట్టింటికి వెళ్తారు. అక్కడ అభిమానులతో ముచ్చటిస్తారు. మరి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి ఈ ఏడాది అలా ప్లాన్ చేస్తున్నాడా? లేక హైదరాబాద్‌లోనే ఉంటాడా? అన్నది తెలియాలి. కానీ పండగ తర్వాత మాత్రం పుష్పరాజ్ అడవి బాట పట్టనున్నాడు. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేరకొండ హీరోగా నటిస్తోన్న ’ఖుషీ’ షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమంత అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్‌కి బ్రేక్ పడిరది. మళ్లీ సంక్రాంతి తర్వాత తిరిగి ప్రారభించాలని శివ నిర్వాణ సన్నాహాలు చేస్తున్నాడు. ఇంకా పలువురు హీరోలు సైతం సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలు పట్టాలెక్కించాలని చూస్తున్నారు. మొత్తానికి పండగ తర్వాత సెట్లో అంతకు మించిన పెద్ద పండగ వాతావరణం కనిపించబోతుందని చెప్పొచ్చు.