త్వరలో వేలం వేస్తామంటున్న దర్శకురాలు
అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): భారతదేశ సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని సంపాదించుకున్న నటి శ్రీదేవి. దక్షిణాదిలో బాలనటిగా మొదలై.. హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. అనంతరం బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది. అయితే.. 2018లో శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయి ఐదేళ్లు.. అయినప్పటికీ ఏదో ఒక విషయంలో ఈ నటి పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి శ్రీదేవి పేరు న్యూస్‌లోకి వచ్చింది. బోనీ కపూర్‌తో పెళ్లి తర్వాత సినిమాలను శ్రీదేవి పూర్తిగా దూరం పెట్టేసింది. 1997లో హిందీలో నటించిన సినిమా ’జుడై’ విడుదలైన తర్వాత.. దాదాపు 15 ఏళ్లకి ’ఇంగ్లిష్ వింగ్లిష్’తో వెండితెరకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఇంగ్లిష్ మాట్లాడటం రాదని విమర్శలు ఎదుర్కొని.. వారికి సమాధానం చెప్పడానినికి ఇంగ్లిష్ నేర్చుకున్న మహిళ ’శశి’ పాత్రలో శ్రీదేవి నటించింది.
ఆ మూవీ అక్టోబర్ 5, 2012న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాదితో ఆ చిత్రం విడుదలై పది సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయనున్నట్లు చిత్ర దర్శకురాలు గౌరి షిండే తెలిపింది. ఆమె కోరిక మేరకేనంటూ..గౌరీ మాట్లాడుతూ.. ’విూ సినిమా విడుదలైన తర్వాత అందులో శ్రీదేవి నటనతో పాటు చిత్రంలో ఆమె ధరించిన చీరలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో, శ్రీదేవితో ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసి.. అనంతరం ఆ చీరలను వేలం వేయాలని అనుకున్నాం. ఆమె హఠాత్తుగా మరణించడంతో పాటు మరి కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
ఈ ఈ సినిమా విడుదలై ఈ ఏడాదికి పది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ చీరలను వేలం వేయాలని నిర్ణయించుకున్నాం. దాని కోసం కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసే ఎన్జీవో గురించి చూస్తున్నాం. ఆ వేలంలో వచ్చిన డబ్బులను ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా థీమ్లాగా అమ్మాయిల చదువుకు ఉపయోగించాలని అనుకుంటున్నాం. అలా ఆమె కోరికను తీర్చాలనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చింది.