మచిలీపట్నం సెప్టెంబర్ 1 ( ఆంధ్ర పత్రిక):
శ్రావణం, శ్రీకరం, శుభకరం..శ్రావణ లక్ష్మీని హిందువులు ప్రతి ఇంటా పూజిస్తారు. ఈ సందర్బంగా స్థానిక రాబర్ట్ సన్ పేట శ్రీరంగ నాయక స్వామి దేవాలయ ప్రాంగణంలో దేవస్థాన ఈవో కందుల వేణుగోపాలరావు ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు 1008 మంది మహిళల చే ఘనంగా నిర్వహించారు.లలితా సహస్ర నామ పారాయణం, లక్ష్మి అష్టకం భక్తి శ్రద్ధలతో ఆచరించారు. శుక్రవారం ఉదయం తొలుత మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలతో సామూహిక పూజలు నిర్వహించారు. శ్రావణ సౌభాగ్య వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించి రక్షా కంకణం, ధరించి ధారణోత్సవం ఆచరించారు. వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు కావలసిన సౌకర్యాలను కల్పించారు. వరలక్ష్మీ వ్రతం చేసుకున్న మహిళలకు, విచ్చేసిన భక్తులకు దేవస్థానం వారు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు ముత్తేవి శ్రీనివాసచార్యులు, సీతారామశేష్ కుమార్ ముత్తైదువుల తో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీదేవి ప్రతి ఇంటా సిరులు కల్పించాలని, భోగంతో కూడిన భాగ్యము, సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఘనంగా నిర్వహించిన ఈ వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం లో ఆద్యంతం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం జరుగుతోందని కరోనా అనంతరం పరిస్థితులు చక్కబడినందువల్ల , రెట్టించిన ఉత్సాహంతో మహిళలు వ్రతాలు ఆచరించడానికి విచ్చేయడం ఆనందదాయకంగా ఉందని దేవస్థానం ఈవో వేణుగోపాలరావు మీడియాతో అన్నారు.అశేషంగా భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించారు.