స్వామివారికి కిలో 16 తులాల బంగారం సమర్పణ
యాదాద్రి భువనగిరి,సెప్టెంబర్30(ఆంధ్రపత్రిక): యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన గోపురమునకు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మనుమడు హిమాన్షు అందించారు. పూజల అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతా రెడ్డి ఉన్నారు. అంతకు ముందు యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. భద్రతా కారణాలతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో యాదగిరిగుట్టకు వెళ్తుండటంతో ఎన్‌ఆర్‌జీఐ మెట్రోస్టేషన్, ఉప్పల్ ఎక్స్‌రోడ్, బోడుప్పల్, మెక్‌డొనాల్డ్స్, ఘట్కేసర్, బీబీనగర్, యాదాద్రి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.