ఉత్సాహంగా సాగుతన్న రైతుల పాదయాత్ర
విశాఖలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందన్నదే చర్చ
కాకినాడ,అక్టోబర్3(ఆంధ్రపత్రిక): ఏపీ రాజ ధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర 21వ రోజు కొనసాగుతోంది. సోమ వారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, దూబచర్ల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ముసుళ్లకుంట, పుల్లలపాడు, నలజర్ల చేరుకుని మధ్యాహ్నం భోజనానికి ఆగింది. అనంతరం తిరిగి ప్రకాశరావు పాలెం వరకు పాదయాత్ర సాగింది. ఇక మధ్యలో జాతీయ రహదారి పోలవరం కుడికాలువ విూదుగా పాదయాత్ర ప్రకాశంరావుపాలెంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి వైజ్ కళాశాలలో బసచేయనున్నారు. పాదయాత్రలో భాగంగా రైతులు నిన్న తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టారు. నల్లజర్ల మండలం, అయ్యవరం దగ్గర రైతులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అమరావతే రాజధాని లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న రైతులు.. ఆంధప్రదేశ్ ఒక్కటే.. రాజధాని అమరావతి ఒక్కటే.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.గత నెల 12న అమరావతి రైతుల పాదయాత్ర మొదలైంది. ఇప్పటికి ఇరవై రోజులు దాటి పాదయాత్ర సాగుతూ వచ్చింది. ఉమ్మడి గుంటూరు క్రిష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలలో పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఒక విధంగా రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర విజయవంతం అయింది. పోలీసు బలగాలతో రైతుల పాదయాత్రను అణచివేయాలని ఒక వైపు ప్రభుత్వం ప్రయత్నాలు కొన్ని చేసినప్పటికీ రైతుల పాదయాత్రలు స్థానికంగా గట్టి మద్దతు దక్కింది. అమరావరి రాజధాని కావాలని ఈ జిల్లాల ప్రజలు బలంగా కోరుకోవడమే దానికి కారణం. అమరావతి రాజధానికి ఈ జిల్లాలు దగ్గరగా ఉండడం మరో కారణం. ఇక ఏకైక రాజధానిగా ఏపీకి అమరావతి మాత్రమే ఉండాలని కూడా వారి బలమైన భావన. విశాఖకు రాజధాని వెళ్తే ఈ జిల్లాలకు పెద్దగా ప్రయోజనం ఉండదు అలాగే కర్నూల్ కి న్యాయ రాజధాని ఇచ్చినా వీరికి ఇబ్బందికరమే. అందుకే ఏకైక రాజధాని కావాలని కోరుతున్న రైతులకు మద్దతు ప్రకటించారు. మరో వైపు చూస్తే అమరావతి రాజధాని విషయంలో జగన్ విపక్ష నేతగా హావిూ ఇచ్చి అధికారంలోకి వచ్చి తప్పారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో జనాలు కూడా మనకు ఒక్క రాజధాని ఉంటే చాలు ఆ విషయంలోనే ప్రభుత్వం మాట తప్పకుండా చేయాల్సింది చేయాలని నినదిస్తున్నారు. ఇలా ప్రజలంతా కూడా తమకు అనుకూలంగా ఉండడంతో రైతుల పాదయాత్ర చక్కగా సాగిపోయింది. ఇక మరో వైపు చూస్తే అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇప్పటికి 3120 కిలోవిూటర్లు దాటింది. అలాగే 312 కిలోవిూటర్లు 100 గ్రామాలను కవర్ చేశారు. ఈ యాత్ర ఆదివారం నాటికి ద్వారకా తిరుమల రాళ్లకుంట తూర్పుగోదావరి జిల్లా అయ్యవరం కొత్తగూడెం వరకూ సాగింది. ఇపుడు తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించింది. విశాఖ రాజధాని అయితే పక్క జిల్లాగా తూర్పు గోదావరికే ఎక్కువ లాభం అన్న లెక్కలు ఉన్నాయి. దాంతో ఈ జిల్లాల గుండా కనుక రైతులు పాదయాత్ర చేస్తే రాజమండ్రి పరిసర ప్రాంతాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పక తప్పదు. అలాగే అమరావతి రైతులకు కచ్చితంగా ఇక్కడి నుంచి స్థానికుల నైతిక మద్దతు అవసరమని అంటున్నారు. తూర్పులో అమరావతి రైతుల పాదయాత్రకు వచ్చే స్పందన బట్టి ఉత్తరాంధ్రా పాదయాత్ర విూద కూడా ఆ ప్రభావం ఉంటుంది అంటున్నారు. మరో వైపు చూస్తే తూర్పు నుంచి తుని ద్వారా విశాఖ జిల్లాలోకి అమరావతి రైతుల పాదయాత్ర ఎంట్రీ ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో కచ్చితంగా వారం పది రోజుల యాత్ర సాగనుంది అని చెబుతున్నారు. ఆ తరువాత ఉత్తరాంధ్రాలో ఎలా సాగుతుంది. విశాఖ జిల్లాలోకి ఎంట్రీయే లేకుండా చూస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు మంత్రులు చెబుతూ వస్తున్నారు. ఒక విధంగా వేడి ఉంది. దాన్ని అధిగమించి ఉత్తరాంధ్రాలో పాదయాత్ర కనుక సక్సెస్ అయితే అమరావతి పాదయాత్రకు తిరుగులేనట్లే. దానికి ముందు తూర్పు లో మార్పు ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.