మచిలీపట్నం నవంబర్ 10, ఆంధ్ర పత్రిక.:
వక్కలంక వెంకట రామ కృష్ణ, స్టాఫ్ రిపోర్టర్..
ఫోటో ఓటర్ల జాబితా పరిశీలకులు త్వరలో జిల్లాకు రానున్న దృష్ట్యా సంబంధిత రికార్డులు సిద్ధంగా ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ, భూముల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో ఓటర్ల జాబితా పరిశీలన కోసం సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా భారత ఎన్నికల సంఘం నియమించిందన్నారు.
వారు త్వరలో జిల్లాకు రానున్నారన్నారు. జిల్లాలోని ఈఆర్వోలు ఏఈఆర్వోలు బూత్ స్థాయి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఫోటో ఓటర్ల జాబితాకు సంబంధించి, ఫారం 6, 7, 8 దరఖాస్తులకు సంబంధించి కొత్తగా ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
పరిశీలకులు ఏ నియోజకవర్గం ఎంపిక చేసుకుంటారో తెలియదు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా రికార్డులు నిర్వహించాలన్నారు.
గన్నవరం, మచిలీపట్నం, పెనమలూరు నియోజకవర్గం ఓకే ఇంటి నంబరు పైన ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించి వివరాలు పంపిందని వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవంగా ఆ ఓటర్లు ఉన్నారా లేదా విచారించి ఓటర్ల జాబితా సరి చేయాలన్నారు.
గత ఏడాదిగా భూ రికార్డులు, భూ సర్వేలలో చాలా మార్పులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిల్లో జరుగుతోందన్నారు.ఇందుకోసం సచివాలయ సిబ్బంది అందరికీ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇటీవల కాలంలో 20 సంవత్సరాలుగా 22 (ఏ)లో ఉన్న భూములను ఆ పరిధి నుండి తొలగించి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు.
ఆ ప్రకారం జిల్లాలో 600కు పైన లబ్ధిదారులకు సంబంధించి 33 గ్రామాల్లో 637 ఎకరాల భూమిని 22 ఏ పరిధి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.ఆ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్ శాఖకు పంపడం జరుగుతుందన్నారు.
సబ్ రిజిస్టార్లు అందరూ ఈ విషయం పైన అవగాహన కలిగి ఉండాలని, భూహక్కుదారుడు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ కోసం వచ్చినపుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అభ్యంతరాలు చెప్పకుండా ప్రభుత్వ విధానం ప్రకారం సావధానంగా రిజిస్ట్రేషన్లు జరపాలన్నారు.
ఈనెల 14వ తేదీన నిర్వహించే జిల్లా పరిషత్ సమావేశం గురించిన సమాచారం ప్రజాప్రతినిధులు అందరికీ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అందించారా లేదా అని జిల్లా కలెక్టర్ జడ్.పి. సీఈఓ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, బి.ఎల్. ఓ.లు తదితర అధికారులు పాల్గొన్నారు.
–