శాసనసభలో ఎమ్మెల్యే జగన్కు తగిన గౌరవంఆయన వాహనానికి అసెంబ్లీ ప్రాంగణం వరకూ అనుమతి
మంత్రుల తరువాత ప్రమాణం చేసే అవకాశం
ఈనాడు, అమరావతి: నూతన శాసనసభ కొలువుదీరిన తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని అధికార కూటమి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది.
ప్రతిపక్ష వైకాపా సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా హుందాగా వ్యవహరించింది. సభలో సభ్యుల సంఖ్యాబలం పరంగా మాజీ సీఎం జగన్కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయినప్పటికీ.. ఆయన గౌరవానికి భంగం కలిగించకూడదని కూటమి సభ్యులకు చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం సభకు వచ్చిన జగన్కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అధికార పక్షం వ్యవహరించింది. మిగతా ఎమ్మెల్యేల్లాగే జగన్ కూడా అసెంబ్లీ నాలుగో ప్రధాన ద్వారం గేటు వద్దే కారు దిగి, నడుచుకుని రావాల్సి ఉంది. కానీ.. ఆయన వాహన శ్రేణిని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టికో వరకు అనుమతించడం విశేషం.
సీఎం చంద్రబాబు ప్రతి నమస్కారం
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అనుభవాన్ని, ఆయన వయసును కూడా చూడకుండా కించపర్చిన ఘటనలు అనేకం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పలుమార్లు అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిలో సభకు వస్తున్న జగన్ను కూటమి సభ్యులు అదే స్థాయిలో విమర్శిస్తారని అసెంబ్లీ ప్రాంగణంలో పెద్ద చర్చే జరిగింది. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దమనసు చాటుకున్నారు. జగన్ గౌరవానికి భంగం కలిగించవద్దని కూటమి సభ్యులకు చెప్పారు. దీంతో జగన్ సభలోకి ప్రవేశించినపుడు, బయటకు వెళ్లినపుడు కూటమి సభ్యులెవరూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తూ సభలోని సభ్యులకు జగన్ నమస్కారం చేయగా, సీఎం చంద్రబాబు ఆయనకు ప్రతి నమస్కారం చేశారు.
అందరిలో ఒక్కడైనా.. ప్రత్యేకంగా
ప్రతిపక్ష నేత హోదా లేనందువల్ల జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో ఆయన పేరు వచ్చినపుడు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ, వైకాపా సభ్యుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణాలు పూర్తయిన తరువాత ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశమిచ్చారు. అంతకుముందు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం వైపు సీట్లలో కూర్చున్నారు. ప్రమాణం పూర్తయిన తరువాత తిరిగి తన సీట్లోకి వెళ్లకుండా బయటకు వెళ్లిపోయారు.
విశాల దృక్పథంతో వ్యవహరించాలన్నారు: మంత్రి పయ్యావుల కేశవ్
‘ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ సమావేశాల మొదటి రోజే తొలి అడుగు వేశారు. విశాల దృక్పథంతో వ్యవహరించాలని కూటమి సభ్యులకు సూచించారు. జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించాలని సీఎం ఆదేశించారు. ప్రతిపక్ష సభ్యుల విషయంలో హుందాగా వ్యవహరించాలని, చిన్న అంశాల్ని రాజకీయం చేయొద్దని స్పష్టం చేశారు’ అని ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ మేరకు సమావేశాలు ప్రారంభమవడానికి ముందు విలేకరులతో మాట్లాడారు.
వెనుకమార్గం నుంచి వచ్చిన జగన్
ముఖ్యమంత్రి హోదాలో మందడం మీదుగా అసెంబ్లీ ముందు వైపున ఉన్న ప్రధాన మార్గంలో వచ్చిన జగన్.. ప్రతిపక్షంలోకి వచ్చాక తొలిరోజు వెనుకవైపు రోడ్డు మార్గంలో వచ్చారు. ఆయన వాహనం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడున్న సందర్శకులు కొందరు ‘జగన్ మావయ్యా.. బైబై జగన్’ అంటూ కేకలు వేశారు. తరువాత జగన్ వైకాపా సభ్యుల కోసం కేటాయించిన గదిలో తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ‘ప్రతిపక్ష హోదా లేదని మనల్ని హేళన చేస్తారు. మైక్ ఇవ్వకుండా మన గొంతు నొక్కుతారు.. అయినా పర్లేదు, మనం ఫైట్ చేయాలి. ప్రతిపక్షంగా స్వరాన్ని వినిపించాలి కదా’ అని వారితో అన్నట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారం తరువాత మళ్లీ ఆ గదికి తిరిగొచ్చిన జగన్ కొద్దిసేపు సభ్యులతో మాట్లాడి ఇంటికి బయల్దేరి వెళ్లిపోయారు. మొత్తంగా ఆయన గంటపాటు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారు.