హైదరాబాద్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్ టీ47లో నిషాద్ కుమార్ వెండి పతకం సొంతం చేసుకున్నాడు.
ఆదివారం ఫైనల్లో అతను 2.04 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. అమెరికా అథ్లెట్ రోడెరిక్ (2.12మీ) పసిడి దక్కించుకోగా.. జియార్గి (2మీ) కాంస్యం నెగ్గాడు. రోడెరిక్కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం.
తొలి ప్రయత్నంలోనే 1.95 మీటర్ల ప్రదర్శన చేసిన నిషాద్ ఉమ్మడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండో ప్రయత్నంలో 2మీ, మూడో ప్రయత్నంలో 2.04మీ.ఎగిరాడు. మరోవైపు రోడెరిక్ కూడా తగ్గలేదు. 2.02మీ, 2.06మీ, 2.08మీ. ప్రదర్శనతో ఎప్పటికప్పుడూ నిషాద్‌ను రెండో స్థానానికి నెట్టాడు.
నిషాద్ 2.08మీ. ఎత్తును ఎగరడంలో విఫలమవడం.. రోడెరిక్ 2.12మీ.ప్రదర్శన చేయడంతో ఫలితం ఖరారైంది. ఈ విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్ రాంపాల్ (1.95) ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 200 మీటర్ల టీ35 పరుగులో ప్రీతి పాల్ కాంస్యం సాధించింది.
ఫైనల్లో ఆమె వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. 30.01 సెకన్లలో రేసు ముగించింది. చైనా స్ప్రింటర్లు జియా (28.15సె), చియాన్చిన్ (29.09సె) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. పారిస్‌లోనే 100మీ.
టీ35 పరుగులో కాంస్యం గెలిచిన ప్రీతి.. పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవని లేఖరా (టోక్యోలో స్వర్ణం, కాంస్యం) తర్వాత ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ప్రీతి రికార్డు నమోదు చేసింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రాకేశ్ కుమార్ త్రుటిలో పతకం కోల్పోయాడు.
కంచు పతక పోరులో ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్ 146-147తో టోక్యో పారాలింపిక్ ఛాంపియన్ హి జియావో (చైనా) చేతిలో ఓడాడు. మూడు రౌండ్లు ముగిసే సరికి 88-87తో ముందంజలో ఉన్న రాకేశ్ ఆ తర్వాత తడబడ్డాడు. నాలుగో రౌండ్లో 28-30తో వెనుకబడ్డాడు. చివరి రౌండ్‌ను 30-30తో ముగించినా ఫలితం లేకపోయింది. సెమీస్‌లో రాకేశ్ 143-145తో టోక్యో కాంస్య విజేత జిన్లియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు.