జిల్లాలో నాటుసారా, మాదక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. నాటుసారా, మాదక ద్రవ్యాల నియంత్రణ, విపత్తుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. నాటుసారా, మాదక ద్రవ్యాల వినియోగం వలన సమాజంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నాటుసారా, మాదక ద్రవ్యాల వలన అనేక దుష్ప్రభావాలు ఉంటాయని,వాటిని గుర్తుపెట్టుకొని విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. నాటుసారా, మాదక ద్రవ్యాల నివారణకు చట్టాలు, నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా సరిహద్దులు ఒడిషా రాష్ట్రం, ఇతర ప్రాంతాలతో కలిగి ఉందని – సరిహద్దులలో నిఘా అధికంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నాటుసారా, మాదక ద్రవ్యాలు తయారీ, రవాణా లేదా ఏ ఇతర సంబంధిత అంశాలలో భాగస్వామ్యులు అయ్యేవారిపైన భారీగా అపరాధ రుసుం విధించాలని ఆయన అన్నారు.
విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి
సంభవించే విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు వరదల భారిన, కొండ చరియలు విరిగిపడే గ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్ల వచ్చని, చెరువులు నిండవచ్చని అందులో ప్రజలు దిగే ప్రయత్నం చేయవచ్చని ఆయన చెప్పారు. రహదారులు కొట్టుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండవచ్చని వాటిపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ఆయన పేర్కొన్నారు. తక్షణం పునరుద్ధరణ చేయుటకు చర్యలు తీసుకోవాలని, గర్భిణీలను ముందుగానే ఆసుపత్రిలో చేర్చాలని ఆయన సూచించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఆహారం అందించడం వంటి అంశాలపై సంబంధిత సిబ్బంది ఫోన్ నంబర్లతో సిద్దంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. యువతను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.
పోలీసు సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో నాటు సారా వినియోగం వలన మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నాటుసారా, మాదక ద్రవ్యాలతో సంబంధం కలిగిన 265 మందిని గత ఏడాది అరెస్టు చేయగా, 431 మందిని ఈ ఏడాది అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. 20 వేల లీటర్ల నాటుసారా, 1.32 లక్షల లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కేసులపై స్పష్టమైన రికార్డులు నెలకొల్పాలని ఆయన పేర్కొన్నారు. బైండోవర్ కేసులలో నోటీసులు జారీ చేస్తే విధిగా హాజరు కావాల్సిందేనని ఆయన చెప్పారు. విధుల నిర్వహణలో ఏ అంశాన్ని సాదాసీదాగా తీసుకోరాదని ఆయన స్పష్టం చేశారు. నాటుసారా, మద్యం వలన గృహ హింస, ఈవ్ టీజింగ్ తదితర సంఘటనలు ఎక్కువగా జరుగుతాయని ఆయన అన్నారు. ప్రతి ప్రదేశం ముఖ్యంగా జనావాసాలు ప్రశాంతతకు నిలయాలుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, సబ్ కలెక్టర్ భావన, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, డిఎస్పీలు ఏ.సుభాష్, శ్రావణి, రెవిన్యూ, పోలీసు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.