పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపాటు
అరెస్ట్ చేసి ఇంటికి తరలించిన పోలీసులు
హైదరాబాద్,డిసెంబర్ 9 (ఆంధ్రపత్రిక): వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ముందు ఆమె దీక్షకు దిగారు. అనుచరులతో కలసి హంగామా సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్‌కు తరలించారు. షర్మిల లోటస్ పాండ్ వద్ద దీక్ష కొనసాగిస్తూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని విమర్శలు చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని ఆరోపించారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే యాత్రను అడ్డుకున్నారన్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై షర్మిల నిరసన తెలిపారు. ఈ క్రమంలో షర్మిల మాట్లాడుతూ తన పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, తన పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఉన్నప్పటికీ కేసీఆర్ న్యాయస్థానాన్ని కూడా అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర చేస్తే విూకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అంటే భయం లేకపోతే పాదయాత్రను ఎందుకు అడ్డుకుం టున్నారన్నారు. ఇప్పటికే 85కు పైగా నియోజకవర్గాలను దాటచ్చామని. ఇప్పుడు తమకు అడుగడుగునా ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.ఈ తరుణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చారు. దీంతో షర్మిలకు సంఫీుభావం తెలిపేందుకు అక్కడకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.