పూనె : హర్యానా, జమ్మూకాశ్మీర్‌లలో ఇటీవల జరిగిన ఎన్నికల ర్యాలీల్లో గాంధీ కుటుంబాన్ని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఆయన విమర్శలపై ఎన్‌సిపి నేత శరద్‌పవార్ మండిపడ్డారు.
తాజాగా పూణె జిల్లాలోని వడ్గావ్ షేరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోడీ ద్రవ్యోల్బణం, శాంతిభద్రతలు, నిరుద్యోగం గురించి మాట్లాడినట్లయితే మేము ఎంతో సంతోషించేవాళ్లము. మేము వారిని అభినందించేవాళ్లము. కానీ ఆయన ఇవేవీ మాట్లాడకుండా.. ఆయన గాంధీ కుటుంబంలోనిమూడు తరాల గురించి మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరిగాంధీ, రాజీవ్ గాంధీ ఇప్పుడు రాహల్గాంధీల గురించి మాట్లాడారు. నెహ్రూ 14 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఇందిరిగాంధీ, రాజీవ్‌గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పారు. దేశాన్ని ఆధునీకరణవైపు నడిపేందుకు రాజీవ్‌గాంధీ ఎన్నో పనులు చేశారు. మూడు తరాలు దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం. మోడీ వారిని మెచ్చుకునే బదులు విమర్శించారు’ అని శరద్‌పవార్ అన్నారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మాహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మార్పు కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము 48 సీట్లకు 31 సీట్లను గెలుచుకుంటామని పవార్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనను ఆమోదించింది. అయితే కేంద్రం చెబుతున్నట్లుగా జమ్మూకాశ్మీర్ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించవచ్చు కదా..! మరి విడివిడిగా ఈ ఎన్నికల పోలింగ్లను ఎందుకు నిర్వహిస్తున్నట్లు అని పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి భిన్నమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? మోసపూరిత రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బిజెపి నేతలు చేస్తున్నారని పవార్ మండిపడ్డారు.