మచిలీపట్నం నవంబర్ 16 ఆంధ్రపత్రిక :
కులగణన సర్వే ఎంతో సున్నితమైన అంశమని, ఇంటింటికి వెళ్లి ఓపిగ్గా మృదువుగా విషయాన్ని సేకరించాలని కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ సూచించారు.
మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల గణన – 2023 ఏడు నియోజకవర్గాల జిల్లా స్థాయి సదస్సులో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది, మండల తహసిల్దార్లకు కుల గణన సర్వేపై శిక్షణ,అవగాహన సూచనలను తెలియజేసే కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ, ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనాభా సమతుల్యత అన్న అంశాలపై ఈనెల
నవంబర్ 27 నుండి డిసెంబర్ 10 వరకు జిల్లాలో కులగణన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
సర్వేలో ఏ విషయాలను అడగాలి సేకరించిన అంశాలను ఏ విధంగా పొందుపరచాలి అనే విషయాలపై తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జిల్లా సంయుక్త కలెక్టర్ వీక్షించారు. తరువాత ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని తరగతులకు చెందిన కులాల వారి సంఖ్యను లెక్కించేందుకు సిద్ధం కావాలని సూచించారు.
ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత తదితర అంశాలపై కుల గణన ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ప్రభుత్వ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోయినా ఈ గణన ద్వారా తెలుస్తుందని చెప్పారు తద్వారా వారు లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు అలాగే మరిన్ని పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు, సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా ముందు ముందు ఎంతగానో వినియోగపడుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
కృష్ణాజిల్లాలో జరిగే కులగణన కార్యక్రమంలో తహసిల్దార్లు మండల స్థాయిలో నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం గురించి ఇంటింటికి తెలియజేయాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన చేపట్టాలని తెలిపారు. వాలంటీర్ ఆధార్ కార్డుతో కాక, సిఎఫ్ఎంఎస్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలన్నారు. బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిష్, ఇంటింటికి వెళ్లేటప్పుడు ఈ కేవైసీ ఉపయోగించాలన్నారు. కులగణలలో వాలంటీర్ల సేవలను పూర్తిగా ఉపయోగించుకోరాదని తెలియజేశారు. సర్వేలో మొదటిసారిగా ఏ మొబైల్ ఫోను ఉపయోగిస్తున్నాము అదే ఫోను సర్వే పూర్తయ్యే వరకు ఉపయోగించాలన్నారు. కుల గణన సర్వేలో వాలంటీర్లను కేవలం కార్యక్రమం గురించి తెలియజేసేందుకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. కుల గణన గురించి ఇంటింటికి వెళ్లి సేకరించిన వివిధ అంశాలను ప్రత్యేకంగా తయారుచేసిన మొబైల్ యాప్ లో జాగ్రత్తగా పొందుపరచాలని ఆమె ఆదేశించారు. వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి శిక్షణ ను ఇచ్చి కుల గణన గురించి పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు సైతం కులగణన కార్యక్రమంలో చురుకుగా పాల్గొవాలని జెసి సూచించారు.
సచివాలయం పరిధిలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా వారి వివరాలను సేకరించాలని తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయా సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్ చేసి గణన వివరాలను సరిపోల్చి చూస్తామని తెలిపారు.
కుల గణనకు సచివాలయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు. ఒకే విడతలో కుల గణను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వే సమయంలో ఎక్కడైనా మిగిలిపోయిన ఇళ్లు ఉంటే డిసెంబరు పదో తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. సర్వే సమయంలో ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అడగరాదని స్పష్టం చేశారు. వ్యక్తి పేరు, వయసు, లింగం, భూమి (వ్యవసాయ, వ్యవసాయేతర), ఇంట్లోని పశువులు, వృత్తి, అన్నిరకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉప కులం, మతం, విద్యార్హత,నివాసం ఉండే ఇళ్లు, తాగునీటి సదుపాయం,మరుగుదొడ్లు, గ్యాస్ ఉందా? లేదా ? అనే వివరాలు మాత్రమే సేకరించాలని తెలిపారు. కుల గణన సర్వేలో భాగంగా ప్రజల కులం,ఉప కులంతో పాటు దాదాపు 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఈ సర్వేలో రూపొందించినట్లు ఆమె వివరించారు.
జిల్లాస్థాయిలో కుల గణన సర్వే కార్యక్రమం పై అవగాహన శిక్షణ కార్యక్రమం ఇదే మాదిరిగానే మండల స్థాయి,డివిజన్ స్థాయి శిక్షణ సమావేశాలు సైతం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పెద్ది రోజా, నోడల్ అధికారి,జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షేక్ షాహిద్ బాబు, ఆర్డీవోలు ఎం. వాణి ( మచిలీపట్నం), రాజు ( ఉయ్యూరు), పి. పద్మావతి (గుడివాడ ) జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ముదిగొండ ఫణి ధూర్జటి, డిఎల్డిఓలు కె. వి సుబ్బారావు,
జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిణి షంసున్నిసా బేగం, పలువురు తహసీల్దార్లు, సచివాలయ సిబ్బంది జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.