Hyundai Motor IPO | ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ మోటార్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25,000 కోట్ల) పబ్లిక్ ఇష్యూ (Hyundai Motor IPO) ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అనుమతి ఇచ్చిందని సబంధిత వర్గాలు పేర్కొన్నారు.
అక్టోబరులోనే ఈ మెగా ఇష్యూ ఉండొచ్చని సమాచారం. 2022లో నమోదైన ఎల్ఐసీ 2.7 బిలియన్ డాలర్ల ఇష్యూ ఇప్పటివరకు దేశీయంగా అతిపెద్ద ఐపీఓగా ఉండగా, హ్యుందాయ్ ఇకపై అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఈ ఇష్యూ కోసం హ్యుందాయ్ మోటార్ ఇండియా విలువను 18-20 బిలియన్ డాలర్లుగా పరిగణించనున్నారు.హ్యుందాయ్ ఐపీఓ మొత్తం ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరగనుంది. ఐపీఓలో భాగంగా 142,194,700 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ షేర్ల జారీ ఉండదు. 1996లో భారత్లో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ.. ప్రస్తుతం 13 మోడళ్లను విక్రయిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత స్టాక్ మార్కెట్లలోకి వస్తున్న తొలి వాహన కంపెనీ కూడా ఇదే అవుతుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఎక్స్ఛేంజీల్లో నమోదైన సంగతి తెలిసిందే.