ఆడపిల్లలకు ప్రోత్సాహం కలిగించేలా పథకం
వైఎస్సార్ కళ్యామస్తు డబ్బులు జమ
అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధికసాయం
పేదలకు పెళ్లిల్లు భారం కాకుండా అమలు చేస్తున్నాం
పథకం అమలుపై సిఎం జగన్మోహన్రెడ్డి వివరణ
అమరావతి,అగస్టు 10 (ఆంధ్రపత్రిక): వైఎస్ఆర్ కళ్యాణమస్తు,వైఎస్ఆర్ షాదీ తోఫా.ఏప్రిల్`జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధికసాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో సీఎం వైయస్.జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ…దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుడుతున్నామన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫా అనే ఈ రెండు కార్యక్ర మాలు చదువులను మరింత ప్రోత్సహిస్తూ.. ఆడిపిల్లలు గొప్పగా చదివేటట్టు ప్రోత్సహిస్తూ.. ఆ కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలని అన్నారు. పేదరికంలో ఉన్న నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసమే ఈ పథకం ప్రవేశ పెట్టామని అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి రావాలని ఆ పిల్లలు బాగా చదివి ప్రతి ఒక్కరూ డిగ్రీవరకు వెళ్లే పరిస్థితి రావాలన్న తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. 18,883 జంటలకు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం. ఈ ఏడాది ఏఫ్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెళ్లిళ్లు అయిన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలు అయి వారిలో కూడా ఏ కారణంగానైనా సర్టిఫికెట్ సకాలంలో సమర్పించలేకపోవడం, అధికారులు తనిఖీకు వచ్చినప్పుడు ఆ సమయంలో లేకపోవడం వంటి రకరకాల కారణాలతో.. ఆ పీరియడ్లో రానివారుంటే, అలా మిగిలిపోయిన వారిని కూడా ఇందులో కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నాం. మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి ఈ రోజు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.గతేడాది అక్టోబరు నుంచి ఈ యేడాది మార్చి వరకు రెండు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేసాం. ఈ మూడు విడతల్లో రూ.267 కోట్లు …. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం.ఈ కార్యక్రమంలో ఇప్పటికే 35,551 జంటలకు మేలు జరుగుతుంది. ప్రతి ఏడాది మూడునెలలకొకమారు చొప్పున నాలుగు విడతల్లో కళ్యాణమస్తు కార్యక్రమం జరుగుతుంది. 86శాతం మంది డిగ్రీ అమ్మాయిలే…ఇవాళ ఇచ్చే 18,883 మంది పిల్లలకు సంబంధించిన విషయాలను గమనిస్తే… కొన్ని మనసుకు సంతోషాన్నిచ్చే విషయాలు కనిపిస్తాయి. ఇందులో 18 నుంచి 21 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మాయిల వివరాల లెక్క చూస్తే.. 8,524 మంది చెల్లెమ్మలు ఉన్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యుత్, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున, మహిళా,శిశుసంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె విజయ ఇతర ఉన్నతాధికారులు హాజరు.