నిజామాబాద్ జిల్లాలో యువజంట బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తమపై బంధువులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన తెలియజేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరించి, ఆ సెల్ఫీ వీడియోను కోటగిరి ఎస్ఐ సందీప్ కు పంపించారు.
అనంతరం రైలు కింద పడి ప్రాణాలను తీసుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా పాతంగల్ మండలం హెగ్జోలికి చెందిన అనిల్ (28), అదే మండలానికి చెందిన శైలజ(24)కు ఏడాది కిందట వివాహమైంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో బంధువులు చిచ్చుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు దంపతులిద్దరూ కుటుంబీకులకు చెప్పి సోమవారం ఇంటి నుంచి వెళ్లారు. అనంతరం తాను గతంలో ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు సూటిపోటి మాటలతో సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు. వారు తమపై చేస్తు చిత్రహింసలకు గురిచేస్తున్నారని వారి దుష్ప్రచారాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియోలను కోటగిరి ఎస్ఎస్ఐ సందీప్ కు పంపారు. ఈ వీడియో చూసిన ఆయన వెంటనే నవీపేట ఎస్ఎస్ఐ యాదగిరి గౌడికి వీడియోతోపాటు వారి సెల్ నంబరు పంపి అప్రమత్తం చేశారు.
దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు వీడియోలో చెప్పడంతో ఆ సమాచారం ప్రకారం స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి మాటువేశారు. ఎంత గాలించినా జాడ కనిపించలేదు. దీంతో బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు తెలిసింది. వెంటనే నవీపేట ఎస్ఐ యాదగిరి గౌడ్ గుర్తించి అక్కడికి చేరుకునేటప్పటికే ఆలస్యమైంది. అనిల్, శైలజల మృతదేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. దీనిపై నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డికి సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా హాస్పిటల్ కు తరలించారు.